బీజేపీతో జనసేన పొత్తు.. ఎవరికి లాభం ?

  • Publish Date - March 6, 2020 / 05:26 PM IST

ఆయన సినిమాలు చేసుకుంటారు.. గ్యాప్‌లో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వెళ్తుంటారు. ఎందుకు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో తెలియదు గానీ.. వీలు చిక్కితే చాలు ఢిల్లీకి వెళ్లి వచ్చేస్తుంటారు. అక్కడకెళ్లి ఏం సాధించారబ్బా అంటే మాత్రం.. చెప్పుకోవడానికి ఏముండదు. ఆయనేమో సినిమాల్లో ఉంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలేమో ఇళ్లల్లో ఉంటారు. కానీ, రాజకీయాలు జరిగిపోవాలి. ప్రభుత్వాన్ని ఏకిపారేయాలి… జనంలో లేకుండా ఇవన్నీ సాధ్యమయ్యేవేనా? ఢిల్లీకి వెళ్లొస్తే పనులు జరిగిపోతాయా?

జనసేన అధినేత ప్రస్తుతానికి సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉన్నారు. వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాలపైన కూడా దృష్టి పెడుతున్నారు. మధ్యలో ఓరోజు అమరావతి రైతుల వద్దకు, కర్నూలులో సుగాలి ప్రీతికి మద్దతుగా ఆందోళనలకు వెళ్లిన పవన్‌.. ఆ తర్వాత మళ్లీ సినిమాలపైనే దృష్టి సారించారు. మళ్లీ ఇప్పుడు సడన్‌గా మరోసారి పవన్‌.. ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మధ్య కాలంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది నాలుగోసారి. కానీ, పవన్‌ ఢిల్లీ ప్రయాణం వెనుక కారణాలు మాత్రం ఎప్పుడూ రహస్యమే. ఆయన ఎందుకు వెళ్తున్నారో.. ఎవరిని కలుస్తున్నారో? ఏం మాట్లాడుతున్నారో.. అన్నది మాత్రం సస్పెన్సే.

శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌… సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేస్తున్నారు. ఎవరిని, ఎందుకు కలుస్తున్నారన్న క్లారిటీ ఇవ్వడం లేదు. వెళ్తున్నారన్న విషయం తప్ప ఎవరికీ ఏమీ అంతుచిక్కడం లేదంటున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎవరో ఒకరిని కలసి రావడమే తప్ప ముఖ్యమైన నేతలను మాత్రం కలవలేకపోతున్నారు. ఇటీవల కాలంలో పవన్‌ కలుసుకున్న వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లాంటి వారే ఉన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా లాంటి వారిని ఇటీవల కలసిన దాఖలాలు లేవంటున్నారు. కీలక నేతలను కలవకుండానే వెనక్కు వచ్చేస్తున్నారు. సరైన నిర్ణయాలు తీసుకున్నది కూడా లేదంటున్నారు. 

రహస్య భేటీల పేరుతో హడావుడి తప్ప ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజా పర్యటనకు కారణాలు కూడా ఎవరికి తోచినది వారు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేసే విషయమై చర్చించేందుకు వెళ్లారని కొందరు అంటున్నారు. వెళ్లిన ప్రతిసారి ఇద్దరు ముగ్గురు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను మాత్రం తప్పకుండా పవన్‌ కలుస్తున్నారని అనుకుంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా జనసేనలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు ఏపీలో చేపట్టడం లేదు. ఎప్పుడో ఓసారి పవన్‌ పర్యటించడం మినహా.. పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలేవీ లేవు. 

బీజేపీతో పొత్తు తరవాత జనసేన పుంజుకుంటుందని భావించారు. కానీ, అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు. పొత్తు తర్వాత జనసేన మరింత బలహీనపడుతోందని పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. రెండు పార్టీలు కలసి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమంలో చేపట్టలేదు. విజయవాడలో కవాతు వాయిదా పడింది. ఇప్పటి దాకా దాని ఊసే లేదు. రాజధాని పర్యటన అన్నారు కానీ అదీ జరగలేదు. ఢిల్లీలో మీటింగ్ అన్నారు… జరగనే లేదు. స్థానిక పోరులో కలిసి పోటీ చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ లేని క్లారిటీ లేదు. మరి ఈసారి పవన్‌ పర్యటనలో ఈ అంశాల గురించి ఏమైనా చర్చిస్తారేమో చూడాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఢిల్లీ టూర్లు చేయడం తప్ప ప్రజల్లో ఉండి చేసే కార్యక్రమాలు ఏవీ కనిపించడం లేదు. పార్టీ తరఫున చేపట్టిన ఒకటి రెండు కార్యక్రమాలు కూడా తూతూ మంత్రంగానే సాగాయి తప్ప.. కొనసాగింపు మాత్రం ఉండడం లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది. మరి తన వ్యవహార శైలిని పవన్‌ మార్చుకుంటారో లేదో చూడాల్సిందేనని జనాలు అనుకుంటున్నారు.