రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆపార్టీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ…ఇతర పార్టీల నుంచి బీజేపీ లో చేరే వారి వలన తమ పార్టీకి ఒరిగేదేమీ లేదని, వారి రాజకీయ మనుగడ కోసమే తమ పార్టీలోకి వస్తున్నారని ఆయన చెప్పారు. టీడీపీ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీ కి లేదని,పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయిన టీడీపీ తో పొత్తు పెట్టుకొని ఆ పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ అంటే విశ్వసనీయత, సిద్దాంతం లేని పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర ఏముందని ఆయనతో కలిసి ముందుకు వెళతామని జీవీఎల్ ప్రశ్నించారు. పోలవరంలో దాదాపు రూ. 2200 కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ తేల్చిందని… దానిపై రివర్స్ టెండరింగ్ వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోందన్నారు. పోలవరం, అమరావతిలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీవీఎల్ చెప్పారు. అప్పు తీసుకోవడం తప్పుకాదని, దాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం దుర్వినియోగం చేయడం చేయడం చంద్రబాబు చేసిన తప్పని అన్నారు. అప్పు చేసిన చంద్రబాబు పసుపు కుంకుమ కింద ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని జీవీఎల్ వివరించారు.
రాజధాని విషయంపై మాట్లాడుతూ జీవీఎల్ … 5 సంవత్సరాలు చంద్రబాబు కబుర్లు చెప్పాడు తప్పితే పెద్దగా చేసిందేమి లేదని, రాజధానిలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఆయన ఎద్దేవాచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం అనేక సంస్థలు కేటాయించిందన్నారు. జల్ జీవన్ మిషన్ అనే అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం త్వరలో ప్రారంభించబోతోందని..ఈ మిషన్ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తామని జీవీఎల్ చెప్పారు. దేశ అభివృద్ధి, ప్రజా సమస్యలపై పోరాడే పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన అన్నారు.