భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు అందుకున్నారు. అప్పటినుంచి ఆయన మాంచి ఊపు మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కొత్త బాస్‌గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలో తన బలాన్ని పెంచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను రెండు రకాల వ్యూహాలను రెడీ చేసుకున్నారు. ప్లాన్-ఏ, ప్లాన్-బీ పేర్లతో ఒక వైపు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీపై విమర్శల దాడిని తీవ్రం చేయాలని సంజయ్ ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ చాలా బలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా ఏ పార్టీకి లేకుండా పోయిందనే అందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో నేరుగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టే అంశాలపై రాజకీయ విమర్శల దాడిని తీవ్రతరం చేయాలని సంజయ్ టీమ్ ప్లాన్ చేసిందట. ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యిందట. అలాగే సున్నితమైన సీఏఏ అంశంపై కూడా రచ్చ చేయాలని భావిస్తోంది. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెట్టాలని యోచిస్తోందని చెబుతున్నారు. దీంతో ఒకేసారి పార్టీ కేడర్‌లో ఉత్సాహం తీసుకురావడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
రాజా సింగ్ వెనుక సంజయ్ ప్లాన్ :
సంజయ్ రచించిన ప్లాన్-ఏ, ప్లాన్-బిలను అమలు చేసే బాధ్యత తనకు అత్యంత సన్నిహితులైన టీమ్ సభ్యులకు ఆయన అప్పగించారు. పార్టీలో తన సహచర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావులను సిద్ధం చేస్తున్నారు. కొత్త బాస్ అండదండలు ఉండటం, పార్టీ లైన్ కూడా సేమ్ కావడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. సభలోనే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ చేసిన తీర్మానప్రతులను రాజాసింగ్ చించి, నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా పదునైన విమర్శలు చేస్తున్న రాజాసింగ్ వెనక సంజయ్ ప్లాన్ ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.
ఏప్రిల్ మొదటి వారంలో ప్రభుత్వ వైఫల్యాలు, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటికి, గడప గడపకు తిరగాలని ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. కొత్త బాస్‌గా బండి సంజయ్ వచ్చిన అనంతరం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందట. గతంలో పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరించిన నేతలు కూడా ఇప్పుడు పదునైన విమర్శలతో అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ ఊపు పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తుందో వేచి చూడాలని జనాలు అంటున్నారు.