Chandrababu Naidu (Photo : Google)
Chandrababu Naidu : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇవాళ (ఏప్రిల్ 29) జరిగిన హింసాత్మక ఘటనలు, టీడీపీ కార్యకర్తపై దాడి అంశంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఆయన డీజీపీకి లేఖ రాశారు. కుప్పంలో పోలీసుల తీరుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. స్థానిక పోలీసుల సహకారంతోనే వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు చంద్రబాబు.
టీడీపీ నేత వి.బాలకృష్ణపై, ఆయన ఇంటిపై వైసీపీ గూండాలు రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. బాలకృష్ణకు చెందిన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ కారణంగా కుప్పం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. 1989 నుండి తాను కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. ఇన్నాళ్లూ కుప్పం ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా ఉందని చంద్రబాబు అన్నారు.
అయితే, వైసీపీ భుత్వం వచ్చాక కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో హింసాత్మక చర్యలు మొదలు పెట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ దాడులు, హింసకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. నిందితులను వదిలేసి బాధిత టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, టీడీపీ క్యాడర్‌పై రౌడీషీట్లు తెరుస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దాడులకు పాల్పడుతున్న వైసీపీ గూండాలను అరెస్ట్ చేయకుండా కేవలం టీడీపీ క్యాడర్‌పై పోలీసులు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తూ పోతే కుప్పంలో ప్రజాస్వామ్యం పూర్తిగా బలవుతుందని చంద్రబాబు వాపోయారు. టీడీపీ క్యాడర్‌పై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని డిమాండ్ చేశారు చంద్రబాబు. దాడిలో బాధితుడు అయిన బాలకృష్ణకు న్యాయం చేయాల్సిన పోలీసులే.. కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. బాలకృష్ణపై దాడి ఘటనపై విచారణ జరపాలని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.
Also Read..Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?