Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?

ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.

Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?

Balineni Srinivasa Reddy:  రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయడం వైసీపీలో తీవ్ర దుమారం రేపింది. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు ఎదురవుతున్న అవమానాలు భరించలేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ తనకు అప్పగించిన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవిని ఆయన వదులుకున్నారు. అందుకు గల కారణాలను తర్వాత వెల్లడిస్తానని బాలినేని 10టీవీ ప్రతినిధితో శనివారం చెప్పారు.

కేబినెట్ విస్తరణలో భాగంగా తనను మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచే బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన కంటే జూనియర్ అయిన ఆదిమూలపు సురేశ్ ను కేబినెట్ లో కొనసాగిస్తూ తనను మాత్రం తప్పించడాన్ని ఆయన అవమానంగా భావించారు. గతంలో అందర్ని మంత్రి పదవుల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం కల్పిస్తే తాను తప్పుకుంటానని వైసీపీ అధిష్టానానికి బాలినేని తేల్చి చెప్పారు. అయితే సీనియారిటి, సామాజిక సమీకరణాల్లో భాగంగా కొంతమందిని ఉంచి, కొందరిని మాత్రం మంత్రి పదవుల నుంచి తప్పించారు. అయితే ప్రకాశం జిల్లా నుంచి మంత్రిగా సురేశ్ అవకాశం కల్పించి తనకు ప్రాధాన్యత తగ్గించడాన్ని బాలినేని తట్టుకోలేకపోయారు.

YS Jagan, Markapuram

మార్కాపురం సభలో మంత్రులు ఆదిమూలపు, చెల్లుబోయిన, మేరుగతో సీఎం జగన్

ప్రొటోకాల్ వివాదంతో మనోవేదన
ఈ నెల 12న మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన సందర్బంగా ప్రొటోకాల్ వివాదంతో మరోసారి బాలినేని మనోవేదనకు గురయ్యారు. మార్కాపురం సభ నుంచి ఒంగోలుకు తిరుగు పయనమైన బాలినేని.. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో శాంతించారు. అన్యమనస్కంగా సభకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ (Audimulapu Suresh), ఆయనకు మధ్య దూరం పెరిగింది.

తలనొప్పిగా మారిన ఆరోపణలు
తాజాగా, విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ (Murthy Yadav) చేస్తున్న ఆరోపణలు బాలినేని తలనొప్పిగా మారాయి. వియ్యంకుడు కుందా భాస్కర్ రెడ్డి విశాఖ జిల్లా అచ్యుతాపురంలో అటవీ భూములు ఆక్రమించి లే అవుట్ వేశారని మూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) లోనూ పెట్టుబడులు పెట్టినట్టు బాలినేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని బాలినేని కొట్టిపారేశారు.

Also Read: వైసీపీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తి.. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా

బాలినేని పయనం ఎటు?
ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వైసీపీలోనే కొనసాగుతారా, వేరే పార్టీలో చేరతారా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళతారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. బాలినేని.. జనసేన పార్టీ (Janasena Party)లోకి వెళతారని కొన్ని మీడియా చానళల్లో వార్తలు వచ్చాయి. టీడీపీతో టచ్ లో ఉన్నారని గతంలో గుసగుసలు వినిపించాయి.

బుజ్జగిస్తే వెనక్కు తగ్గుతారా?
మరోవైపు వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తే బాలినేని చల్లబడతారా, లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. బాలినేని ఎలాంటి స్టెప్ వేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే బాలినేని లాంటి సీనియర్ నాయకుడిని తాము వదులుకోబోమని, త్వరలోనే పరిష్కారం అవుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.