Balineni: వైసీపీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తి.. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా

మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.

Balineni: వైసీపీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తి.. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రకాశం జిల్లా, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి ఆయన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా తనను మంత్రి పదవి నుంచి తప్పించి.. ఆదిమూలపు సురేశ్ ను కొనసాగించడం పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ (Audimulapu Suresh) ను కేబినెట్ లో కొనసాగిస్తూ తనను తప్పించడాన్ని ఆయన అవమానంగా భావించారు. ముందుగా కేటాయించిన అనంతరం ఒంగోలు నెల్లూరు బాపట్ల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మార్చడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతున్నట్టుగా ఆయన భావించారు. ఇటీవల మార్కాపురం సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పర్యటనలో ప్రొటోకాల్ లో ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని ఆయన కలత చెందినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

అధిష్టానం ఆమోదిస్తుందా?
పార్టీలో సీనియర్ నాయకుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు బాలినేని. ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న బాలినేనిని వైసీపీ అధిష్టానం అంత సులువుగా వదులుకోదని, ఆయనను బుజ్జగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలినేని నిర్ణయం ప్రకాశం జిల్లా (Prakasam District)లో వైసీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.

Kakani Govardhan Reddy
టీ కప్పులో తుఫాన్ లాంటిదే: మంత్రి కాకాని

బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) స్పందించారు. శనివారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. రీజినల్ కో ఆర్డినేటర్ గా బాలినేని తప్పుకున్నారనేది సోషల్ మీడియా ప్రచారమని కొట్టిపారేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో సీనియర్ నాయకుడని, ఆయన గౌరవానికి ఎలాంటి భంగం ఉండదన్నారు. బాలినేనితో పార్టీ అధిష్టానం మాట్లాడుతుందని చెప్పారు. ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదేనని అన్నారు.