Chandrababu Naidu : సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్నారు, అధికారంలోకి వస్తే వాటి ఛార్జీలు తగ్గిస్తా-చంద్రబాబు

Chandrababu Naidu : జగన్ మాదిరిగా నేను ఆలోచించి ఉంటే ఆయన పాదయాత్ర చేసేవారా? ఈ నాలుగేళ్లల్లో జగన్ ఒక్క పనైనా చేశారా?

Chandrababu Naidu(Photo : Google)

Chandrababu Naidu : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. పెదకూరపాడులో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. సంక్షేమం పేరుతో జగన్ పది రూపాయలు ఇచ్చి ప్రజల నుంచి వంద రూపాయలు లాక్కుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.2లక్షలు అప్పు తెచ్చారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి అప్పు ఇచ్చేవారు కూడా లేరని అన్నారు.

పెట్రో ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువ అన్న చంద్రబాబు.. దీని వల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. రూ.600 వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 అయ్యిందని చంద్రబాబు వాపోయారు. తాను ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదని చంద్రబాబు గుర్తు చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గించడం కోసం సౌర, పవన్ విద్యుత్ తయారీని ప్రోత్సహించానని తెలిపారు. ఈసారి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

”అమరావతిని అంతం చేయడానికి ఓ రాక్షసుడు వచ్చాడు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో అంతా చూశారు. బాబాయ్ ని చంపి గుండెపోటుగా చిత్రీకరించారు. ఆ నేరాన్ని నాపై మోపి తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. నారాసుర రక్త చరిత్ర అని ఆరోపించి ఎన్నికల్లో లబ్ధి పొందారు. నక్సల్స్ బాంబు దాడిలో ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టిన చరిత్ర నాది. కోడి కత్తి డ్రామా కూడా ఎన్ఐఏ బట్టబయలు చేసింది. ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.(Chandrababu Naidu)

రాష్ట్రంలో సంక్షేమానికి నాంది పలికి ఎన్నో సంస్కరణలకు తెరతీసింది తెలుగుదేశం పార్టీ. జాతీయ చానల్ ఆహ్వానం మేరకు ఇవాళ దేశ రాజకీయాలపై మాట్లాడాను. సెల్ ఫోన్లు ఇంత విస్తృతంగా రావటానికి టెలికాం సంస్కరణలు రావాలని చెప్పింది నేనే. మన తెలుగు వారు సాంకేతిక రంగంలో రాణించటానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఆదాయంలో నంబర్ వన్ గా తయారవటానికి పునాది వేసింది నేను. నా తర్వాత వచ్చిన వైఎస్ గానీ, మిగతా వారు గానీ వాటిని అడ్డుకోలేదు. అందువల్లే హైదరాబాద్ అంతలా అభివృద్ధిలో దూసుకెళ్ళింది. ఇక్కడ మాత్రం జగన్ విధ్వంసం సృష్టించారు. ప్రజావేదికతో మొదలైన విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. చివరకు నా పర్యటనకు కూడా ఇబ్బందులు సృష్టించారు. కనీసం ఫ్లెక్సీలు కూడా పెట్టకుండా మా పార్టీ వారిని అడ్డుకున్నారు. జగన్ మాదిరిగా నేను ఆలోచించి ఉంటే ఆయన పాదయాత్ర చేసేవారా? ఈ నాలుగేళ్లల్లో జగన్ ఒక్క పనైనా చేశారా?

చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచి జనంపై భారం మోపారు. మీ ఇంటికి జగన్ స్టిక్కర్ ఎలా వేస్తారు? సైకో బొమ్మ వేయటాన్ని మీరు అంగీకరిస్తారా? ఆ బొమ్మ తీసేయండి. ఏమీ కాదు. ఇంటింటికీ బొమ్మలు వేస్తే.. ఎమ్మెల్యేల ముఖానికి మీ బొమ్మ వేస్తామని చెప్పండి. చివరికి ఆస్తి పత్రాలపై ముఖ్యమంత్రి ఫొటో ఏంటి?

Also Read..Ramesh Naidu: ఏపీలో సంచలన రాజకీయ మార్పులు.. జగన్ కు త్వరలో షాక్ తగలబోతోంది..

సాక్షాత్తు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నాపై దాడి చేయించారు. నన్ను కాపాడాలని ఎన్.ఎస్.జీ కమాండో గాయపడ్డారు. ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలి. నేను ఎస్సీలకు అన్యాయం చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సీలకు ఎవరు న్యాయం చేశారో చర్చకు సిద్ధం.
పార్లమెంటు, అసెంబ్లీ స్పీకర్లుగా దళితులను చేసింది తెలుగుదేశం పార్టీ. కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి కావటానికి కారణం తెలుగుదేశం పార్టీ. జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి అంటరానితనం నిర్మూలనకు కృషి చేసింది తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.(Chandrababu Naidu)

దళిత ఉప ప్రణాళిక ఆపేసి 22 పథకాలు ఆపేసింది వైసీపీ ప్రభుత్వం. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నారు. ఎస్సీల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేకంగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మరి ఏం చేశారని జగన్ బొమ్మ ఇంటికి వేసుకోవాలి?

రంజాన్ తోఫా, విదేశీ విద్య ఆపేసింది నిజం కాదా? మహిళలను మగవారితో సమానంగా పైకి తెచ్చేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను. సంక్షేమం, అభివృద్ధి కావాలన్నా.. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా బాబు రావాల్సిందే. కృష్ణా నదిలో రోడ్డు వేసి ఇసుక దోచిన ఘనుడు పెదకూరపాడు ఎమ్మెల్యే. ఇక్కడ దోచుకున్న ఇసుక సొమ్ము ఎవరికి పోతోంది? ఈ ఎమ్మెల్యేకు శంకర్ రావు అని కాదు వంకరరావు అని పేరు పెట్టాలి. ఇసుకను యంత్రాలతో తవ్వి దోపిడీ చేస్తూ రీచ్ లలో కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు.

పేదరికం లేని సమాజం చూడాలని నా ధ్యేయం. ఎక్కడ నిరుపేదలుంటే వారికి తెలుగుదేశం జెండా అండగా ఉంటుంది. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు అంతా అనుకుంటే పేదరికం ఉండదు. 2047 కల్లా రాష్ట్రంలో పేదరికం లేకుండా చూడాలని నా ఆశయం. వందేళ్ల స్వాతంత్ర వేడుకల నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుందాం.

చాలా మామూలు కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదివా. జాతీయ రహదారులు బాగున్నాయి. కానీ రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా బాగోలేదు. రహదారులు అధ్వాన్నంగా ఉండటానికి కారణం వైసీపీ ప్రభుత్వం. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జగనన్న మీ భవిష్యత్తు కాదు. జగన్ మన దరిద్రం, రాష్ట్రానికి పట్టిన శని. క్యాన్సర్ వస్తే శరీరం పాడైపోయినట్లు, ఈ జగన్ వల్ల రాష్ట్రం నాశనమైంది. సైకో పోవాలి సైకిల్ రావాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.