తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. లోకేష్ చేస్తున్నది ఇసుక దీక్ష కాదని డైటింగ్ దీక్ష అంటూ ఎద్దేవా చేశారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో మాజీ టీడీపీ ఎంపీ మురళీ మోహన్ ఢిల్లీలో దీక్షలు వళ్లు తగ్గించుకుంటానికి చేస్తున్నట్లు చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసిన శ్రీకాంత్ రెడ్డి, వానలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఇసుక సరఫరాకు అంతరాయం ఏర్పడితే టీడీపీ నేతలు దీక్షలు అంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇసుక పరిస్ధితి గమనించే సీఎం జగన్ నవంబర్‌లో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీడీపీ అధికారంలో ఉండగా అందిన కాడికి ఇసుకను దోచుకున్నారని, జగన్ అధికారం చేపట్టాక ఇసుక పాలసీ తీసుకొచ్చారని అన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా చంద్రబాబుకు అనుకూలంగా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు.
భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు చేసిన మోసం తెలిస్తే కార్మికులు ఆయనను, ఆయన కుమారుడు లోకేష్‌ను తరిమికొడతారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పదివేల కోట్లు వచ్చే అవకాశం ఉంటే రానీయకుండా కమీషన్ల కోసం దోచుకున్నారని, వేసవిలో హేరిటేజ్ కోసం చలివేంద్రాలు పెట్టి భవన నిర్మాణ కార్మికుల సెస్‌ను 30 కోట్ల మేర దోచుకుంది మీరు కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల సెస్‌కు సంబంధించి వందల కోట్ల నిధులు పక్కదారి పట్టించడంపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు.
సీఎం జగన్ పారదర్శకపాలన చూసి ఓర్వలేక, చంద్రబాబు సీఎంను వాడు, వీడు అంటూ సంభోదిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఇసుక కొరత నివారణ చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని, మీకు చిత్తశుద్ది ఉంటే ఆ విధానంలో ఏమైనా తప్పులు ఉంటే తెలియచేయాలని అన్నారు. అవినీతికి తావుండకూడదని ముఖ్యమంత్రి జగన్ అందరికీ ఇసుక అందజేయాలంటూ అధికారులను ఆదేశించారంటూ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.