Jagan Focus On YCP 7th List
YCP 7th List : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏడో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. పలు లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సీఎంవోకు చేరుకున్నారు. వారంతా సజ్జల రాకమృష్ణారెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిశారు.
వైసీపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఇంఛార్జిల మార్పులకు సంబంధించి ఇంకా కసరత్తు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే 6 లిస్టులు విడుదల చేసింది వైసీపీ. ఎక్కువ శాతం అసెంబ్లీ ఇంఛార్జిలకు సంబంధించి మార్పులు జరిగాయి. పార్లమెంటుకు సంబంధించి ఇప్పటివరకు 15 స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు. ఇక, ఏడో లిస్టుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించేశారు జగన్. ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నారు ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి పిలిపించారు.
Also Read : వాళ్లను తిట్టవు నిన్నెలా నమ్మాలని అడిగారు.. జగన్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన వసంత కృష్ణప్రసాద్
ఎమ్మెల్యేలతో పాటు కొందరు పార్టీ ఇంఛార్జిలు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. పర్చూరు ఇంఛార్జి ఆమంచి కృష్ణమోహన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు. పర్చూరు నుంచి కాకుండా చీరాల నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒంగోలు పార్లమెంటు ఇంఛార్జిగా ఎవరిని నియమించాలి అనే దానిపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిపించిన జగన్.. ఈ విషయంపై ఆయనతో మాట్లాడారు.
అవనిగడ్డ ఇంఛార్జిగా సింహాద్రి చంద్రశేఖర్ ను జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, వయసురీత్యా తాను తిరగలేను కాబట్టి తన కుమారుడు సింహాద్రి రాంచరణ్ కు అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరారు చంద్రశేఖర్. దీనికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువగా పార్లమెంట్ స్థానాలపై జగన్ ఫోకస్ పెట్టారు. ఒంగోలు, నెల్లూరు, విజయనగరం, అనకాపల్లి, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను ప్రకటించాల్సి ఉంది. బాపట్ల లోక్ సభ స్థానంలోనూ మార్పులు చేసేందుకు జగన్ నిర్ణయించారు.
Also Read : జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇందులో భాగంగా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ను క్యాంప్ ఆఫీసుకి పిలిపించారు. వచ్చే ఎన్నికల్లో నందిగం నుంచి సురేశ్ కు అవకాశం లేదని ఇప్పటికే ఆయనకు చెప్పినట్లు సమాచారం. సురేశ్ స్థానంలో ఇటీవలే పార్టీలోకి వచ్చిన రావెల కిషోర్ బాబు లేదా మెరుగు నాగార్జునను బాపట్ల లోక్ సభ ఇంఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక వైసీపీ ఏడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.