జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

సీట్ల కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని.. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

Gorantla Butchaiah Chowdary comments on TDP Janasena seats sharing

Gorantla Butchaiah Chowdary : జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపుపై టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలో 10 టీవీతో మాట్లాడుతూ.. తనకు కచ్చితంగా సీటు దక్కుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే తాను సీనియర్ నాయకుడినని, తన సీటు విషయంలో ఎటువంటి టెన్షన్ లేదన్నారు. రాజమండ్రి అర్బన్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

”సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ సీట్లు ఇస్తానని గతంలోని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేకంగా నాకు ఇవ్వమని అడగను. ఆందోళన చెందవద్దని నా కేడర్ కూడా చెప్పాను. సీట్ల కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు అడగటానికి జనసేన ప్రయత్నం చేస్తోంది. అయితే జిల్లాలో అన్ని కులాలను చూడాల్సిన అవసరం ఉంది. జనసేనతో పొత్తులపై రాష్ట్రమంతా యూనిట్ గా చూడాల్సిన అవసరం ఉంటుంద”ని వ్యాఖ్యానించారు.

Also Read: జనసైనికులకు మంత్రి అంబటి రాంబాబు సలహా.. ఏంటో తెలుసా?

కాగా, రాజానగరం, రాజోలు నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. మండపేట, అరకు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చిందని పవన్ వివరించారు. మరోవైపు సీట్ల కేటాయింపుపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం రెండు దఫాలుగా చర్చలు జరిపారు. మరోసారి ఈ నెల 8న భేటీ కావాలని ఇరువురు నాయకులు నిర్ణయించినట్టు సమాచారం.