CM Jagan : ఆయన పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తుకొస్తాయి- సీఎం జగన్ నిప్పులు

గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు ముఖ్యమంత్రి జగన్.

CM Jagan Slams Chandrababu And Pawan Kalyan

CM Jagan : చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలే గుర్తుకొస్తాయని సీఎం జగన్ అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అనే మాట గుర్తొస్తుందని విమర్శించారు. 2014లో పవన్, చంద్రబాబు మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు ముఖ్యమంత్రి జగన్.

తేడా చూడండి..
అప్పటికి ఇప్పటికీ తేడా చూడండి. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా? అని ఆలోచన చేయండి. నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్టతకు ఈ నాలుగేళ్లలోనే ఏకంగా 19వేల 190 కోట్ల రూపాయల సహాయం అందించింది మీ బిడ్డ ప్రభుత్వం. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా? ఇలాంటి చేయూత అనే స్కీమ్ ఎప్పుడైనా చూశారా? అని ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నా.

ఇదే గుర్తొస్తుంది..
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్.. వీరిద్దరి పేర్లు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి. మరి దత్తపుత్రుడు పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం, కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది.

ఒక్క రూపాయి ఇవ్వట్లేదు..
మీ కుటుంబసభ్యులతో మీరంతా బ్యాంకులకు వెళ్లండి. బ్యాంకులకు వెళ్లి పది సంవత్సరాల బ్యాంక్ స్టేట్ మెంట్ ఇవ్వమని బ్యాంకు మేనేజర్లను అడగండి. ఐదేళ్ల చంద్రబాబు పాలన, ఐదేళ్ల మీ బిడ్డ పాలన.. పదేళ్ల స్టేట్ మెంట్ ఇవ్వమని అడగండి. ఆ బ్యాంక్ స్టేట్ మెంట్ చూసినప్పుడు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కనీసం మీ అకౌంట్ కు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా? అని మిమ్మల్ని అడుగుతున్నా.

అన్నీ మోసాలే..
బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం. గర్బిణులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం. బడులకు వెళ్లే ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం. ఇల్లాలికి ఇస్తానన్న సబ్సిడీ సిలిండర్ సైతం ఇంకో మోసం. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేస్తానన్న రుణమాఫీ దారుణమైన మోసం. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం. అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలని అనుకున్నది ఇంకో గజ మోసం.

Also Read : టీడీపీలో కొత్త తరహా రాజకీయం.. ఎలాంటి నష్టం జరుగుతుందో అనే ఆందోళనలో అధిష్టానం

 

ట్రెండింగ్ వార్తలు