మమల్ని వెలి వేశారంటూ చిన్నారి రాసిన లేఖకు స్పందించిన సీఎం జగన్ 

  • Publish Date - September 14, 2019 / 07:52 AM IST

తమకుటుంబాన్ని వెలివేశారని.. సహాయం చేయాలని కోరుతూ  ప్రకాశం జిల్లాకు చెందిన ఒక  చిన్నారి సీఎం జగన్ కు లేఖ రాసింది. ఈ అంశంపై సీఎం జగన్‌ వెంటనే స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. గ్రామంలోని కక్షల కారణంగా  తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ  రాసింది. తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తనతో ఎవరూ మాట్లాడటం లేదని పుష్ప లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో బడిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. 

వివరాల్లోకి వెళితే…  ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురంనకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కోడూరి వెంకటేశ్వర్లుకు, గ్రామ పెద్దలకు ఊరిలోని ఓ భూమి విషయమై వివాదం మొదలైంది. దీంతో మాజీ ఎంపీటీసీ సభ్యుడికి, గ్రామ పెద్దలకు మధ్య  నెలకొన్న వివాదం కొద్దిరోజులుగా  కోనసాగుతోంది. గ్రామ కాపులు మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని బహిష్కరించారు. వారితో ఎవరు మాట్లాడిన రూ.10వేలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. పాఠశాలలో చదువుకుంటున్న వారి పిల్లలతో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదని తీర్మానించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ పరిస్ధితుల్లో చిన్నారి సీఎం కు లేఖ రాసింది.

చిన్నారి కోడురి పుష్ప లేఖపై  స్పందించిన సీఎం జగన్‌ శనివారం నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి విషయం గురించి వివరాలు అడిగారు. వెంటనే రామచంద్రాపురం  వెళ్లి బాదితురాలి వివరాలు కనుక్కొని సమస్యను పరిష్కరించమని కలెక్టర్‌ను ఆదేశించారు.