హోదా కోసం హస్తిన బాట :  వెంకయ్యతో భేటీ

  • Publish Date - January 28, 2019 / 03:45 PM IST

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యాన  మాజీమంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా చేపట్టిన”ఆంధ్రుల జనఘోష యాత్ర ” ఢిల్లీ చేరుకుంది. ఉత్తరాంధ్ర వాసులు  నల్ల వస్త్రాలు ధరించి ఏపీకిచ్చిన విభజన హామీలు అమలు పరచాలంటూ, ఏపీపై కేంద్ర వైఖరిపట్ల ఢిల్లీ రైల్వేస్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసారు. 27వ తేదీ ఆదివారం ఉదయం విశాఖపట్నంలో బయలు దేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ సోమవారం సాయంత్ర ఢిల్లీ చేరుకుంది. 

విభజన హామీల అమలు కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని వేదిక నాయకులు రాజకీయ పార్టీలను కోరారు. వేదిక సభ్యులు ఈ నెల 29, 30, 31 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు పరచని మోడీ ప్రభుత్వానికి ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పాలని నాయకులు కోరారు.

వెనుకబడిన ఏడు జిల్లాలకు ఇవ్వాల్సిన పెండింగ్‌ నిధులు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను ఆర్ధికంగా ఆదుకోవాలి, విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలనే డిమాండ్లతో వేదిక నాయకులు ఢిల్లీ యాత్ర చేపట్టారు. జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగతున్నందున ఢిల్లీలో పలవురు రాజకీయ నాయకులను కలిసి ఏపీకి మద్దతుగా నిలవాలని కోరతాంమని కొణతాల చెప్పారు.  ఉత్తరాంధ్ర చర్చావేదిక సభ్యులు మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవనున్నారు.