మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. వివేకా హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నానని ఆయన తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో డిసెంబర్ 6నే విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా కోరిన జమ్మలమడుగు డీఎస్పీ కోరారని… ఆరోజు ఢిల్లీలో ఉండటం వల్ల హాజరుకాలేదని ఆయన చెప్పుకొచ్చారు.డిసెంబర్ 11 లేదా 12 తేదీల్లో సిట్ విచారణకు హాజరు కావాలని కోరిందని ఆయన తెలిపారు.
వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో వారి అంతరాత్మకే తెలుసని..టీడీపీ హయాంలో సిట్ వద్దు సీబీఐ కావాలని అడిగిన వారు… నేడు సిట్ కావాలని అడగటం వెనుక ఆంతర్యం ఏమిటని ఆది ప్రశ్నించారు. సిట్ పైన ఎవరికీ అవగాహన లేదు.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ కుటుంబం నా పై కక్ష కట్టింది, జాగ్రత్తగా ఉండాలని చాలా మంది నాతో చెప్పారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసులో ఒక్క శాతం ప్రమేయం ఉందని నిరూపణైతే పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని తేల్చి చెప్పారు.
నా పై వేధింపులు మంచిది కాదు..నాది తప్పుంటే ఎన్ కౌంటర్ చేసుకోవచ్చు..నేను కనిపించకుండా దాక్కోవడానికి చీమను కాను.. నేను మనిషినే.. ఇష్టం వచ్చినట్లు నాపై టీవీల్లో కథనాలు ప్రసారం చేయడం తగదని హితవు పలికారు. టీవీల్లో ప్రసారమైన తప్పుడు కథనాలతో తన కుటుంబ సభ్యులు మనోవేదనకు గురైయ్యారని ఆయన అన్నారు.