పోలీసులకు వల్లభనేని వంశీ ఫిర్యాదు

  • Publish Date - November 15, 2019 / 10:04 AM IST

టీడీపీ నుంచి సస్పెండైన  గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ మోహన్… సోషల్ మీడియాలో తనపై  జరుగుతున్న దుష్ప్రచారం పై చర్యలు తీసుకోవాలని  విజయవాడ పోలీసు కమీషనర్ కి  ఫిర్యాదుచేశారు.  అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి  తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  అసలు దోషులను  పట్టుకుని శిక్షించాలని ఆయన పోలీస్ కమిషనర్ ను కోరారు.

ఈ  దుష్ప్రచారం  టీడీపీకి చెందిన వెబ్ సైట్ల నుండే జరుగుతోందని ప్రాథమిక సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు వివరించారు.తనపై ఆరోపణలు, విమర్శలు, చేస్తున్న టిడిపి నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసని…. దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాత్రాన నా ఇమేజ్ ఏమీ తగ్గదు అని వంశీ అన్నారు.  ఎన్నికల సమయాల్లో  సూట్కేసులు కొట్టేసేవారు తనపై ఆరోపణలు చేస్తే వారి బండారం అంతా బయట పెడతానని  వంశీ మోహన్ హెచ్చరించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మీడియా సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై శుక్రవారం చర్యలు తీసుకుంది టీడీపీ అధిష్టానం. వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది.ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తూ.. ఆయనకు షోకాజ్‌ నోటీసు విడుదల చేసింది.  పార్టీకి రాజీనామా చేసిన సమయంలో  రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని చెప్పిన వంశీ , కొన్నాళ్లకే జగన్ తో కలిసి నడుస్తానని ప్రకటించారు. గురువారం నవంబర్14న విలేకరుల సమావేశం పెట్టి.. టీడీపీపై.. పార్టీ అధినేత చంద్రబాబుపై, లోకేష్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు… అధికారం లేకపోతే ఐదారునెలలు కూడా ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఇసుక కోసం దీక్షలు చేయటం సరికాదని విమర్శించారు.  దీంతో  టీడీపీ అధిష్టానం శుక్రవారం వంశీని పార్టీనుంచి సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో వంశీ వైసీపీలో చేరికకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు.