టీడీపీలో కలకలం : సీఎం జగన్ తో గన్నవరం ఎమ్మెల్యే వంశీ భేటీ

  • Publish Date - October 25, 2019 / 12:05 PM IST

ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలితో ఆ పార్టీలో కలకలం రేగింది. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ తో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో కలిసి ఉండవల్లిలోని సీఎం జగన్ ఇంటికి వెళ్లారు వంశీ. చాలాసేపు అక్కడే ఉన్నారు.

ఇద్దరు మంత్రులతో కలిసి వెళ్లటం చూస్తుంటే.. వంశీ పార్టీ మారటం ఖాయం అనే చర్చ కూడా మొదలైంది. సమావేశం ముగిసి బయటకు వచ్చిన తర్వాత కూడా వంశీ నోరు విప్పలేదు. మంత్రులు కూడా మౌనంగానే ఉన్నారు. వంశీ పార్టీ మారాలని డిసైడ్ అయ్యి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యం అయ్యే పనేనా అనే డౌట్ వస్తోంది. ఒక వేళ వంశీ  టీడీపీకి రాజీనామా చేస్తే గన్నవరం నియోజక వర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు వంశీ విజయావకాశాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

సీఎం జగన్ తో భేటీకి ముందు బీజేపీ నేత సుజనాచౌదరితోనూ సమావేశం అయ్యారు వంశీ. రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చినా.. వాటిపై వివరణ లేదు. ఈ హీట్ చల్లారకముందే.. మంత్రులతో కలిసి వంశీ సీఎం జగన్ తో భేటీ కావటం సంచలనంగా మారింది.

తనపై నమోదైన కేసులపై గత రెండు రోజులుగా చంద్రబాబుతో వంశీ మంతనాలు జరిపారు. అయినా అక్టోబరు 25న సీఎం జగన్ తో  వంశీ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం తన రాజకీయ గురువు సుజనా చౌదరితోనూ వంశీ భేటీ అయ్యారు. వంశీ ఇంతకు ముందు నకిలీ ఇళ్లపట్టాల కేసులో ఇరుక్కున్నారు. ఏ క్షణంలో నైనావంశీని అరెస్టు చేస్తారని గత 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. దీంతోగత నాలుగు రోజులుగా వంశీ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. చంద్రబాబును కలిసినప్పుడు  కూడా తనపై నమోదైన కేసులపై ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కోంటానని చెప్పినట్లు తెలుస్తోంది. 

తనపైనా తన అనుచరులపై నమోదైన కేసుల పై ఎంతవరకైనా పోరాడతానని ఆయన అనుచరుల వద్ద చెప్పగా..అనుచరులు ఇంక పోరాడలేమని పార్టీ మారితే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం సీఎం జగన్ తో వంశీ భేటీ అవటం మరింత  ఆసక్తి రేపుతోంది.  జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో కలిసి సీఎంను కలవటంతో ఇక వంశీ పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.  కొడాలి నాని, వంశీ  మంచి స్నేహితులుగా ఉండటంతో ఇక పార్టీ మారటం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో కలిసి డిన్నర్ చేశారు సుజనాచౌదరి. బలరాం కూడా పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే బలరాం వివరణ ఇచ్చారు. పార్టీ మారటం లేదన్నారు ఆయన. మిత్రుడితో కలిసి భోజనం చేసినంత మాత్రాన పార్టీ మారటం కాదన్నారు బలరాం.