గిద్దలూరు టికెట్ ఎవరికి : అన్నాతో ఐవీ రెడ్డి ఢీ

ప్రకాశం: జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి వైసీపీకి చెందిన ఓ నేత పట్టు సాధించాలనుకున్నాడు. కొంత వరకు సక్సెస్ అయ్యాడు. అయితే పావులు కదుపుదామనుకున్న చోట పప్పులుడకలేదు. పార్టీలోని వైరి వర్గం ఎదురు తిరగడంతో సదరు నేతకు కొత్త సమస్య వచ్చి పడింది. పట్టు సాధించాలనుకున్న ఆ నేత ఎవరు ? ఆ నేతకు వచ్చిన సమస్య ఏంటి ? ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పాలిటిక్స్‌పై ప్రత్యేక కథనం.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి పెట్టని కోట. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబుపై వైసీపీ నేత అశోక్‌రెడ్డి విజయం సాధించారు. తర్వాత అశోక్‌రెడ్డి టీడీపీలో చేరడంతో….నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఐవీ రెడ్డిని నియమించింది వైసీపీ. ఐతే.. ఐవీరెడ్డి నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లి మాస్ లీడర్‌గా ఎదగలేకపోయారు. నాయకత్వ లోపాన్ని గ్రహించిన జగన్ బలమైన అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించారు.
ప్రశాంత్ కిషోర్ టీంతో పాటు జగన్ చేయించిన సర్వేల్లోనూ నాయకత్వ మార్పు తథ్యమని తేలింది. ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న వైసీపీకి….అన్నా రాంబాబు రూపంలో దొరికాడు. సర్వేలన్ని కూడా రాంబాబుకే జై కొట్టడంతో….మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వేగంగా పావులు కదిపారు. రాంబాబుకు జగన్‌తో వైసీపీ కండువా కప్పించారు. దీంతో అప్రమత్తమైన అన్నా వైరి వర్గం సాయి కల్పనారెడ్డి, ఐవీరెడ్డిలు ఒక్కటయ్యారు. రాంబాబుకు సీటు ఎలా ఇస్తారంటూ….ఇద్దరు నేతలు నిలదీయాలని డిసైడ్ అయ్యారు. గిద్దలూరు అసెంబ్లీ సీటు కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు…పోటీ పడుతుండటంతో అన్నా రాంబాబుకు పరిస్థితి వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయి. తమలో ఎవరికిచ్చినా పార్టీ విజయం కోసం పని చేస్తామంటూ…జగన్‌కు వివరించారు. లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరికలు పంపారు.
పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన పార్టీ అధ్యక్షుడు జగన్…గిద్దలూరు సమన్వయకర్తగా ఐవీ రెడ్డినే కొనసాగించాలంటూ యుద్ద ప్రాతిపదికన లేఖను విడుదల చేశారు. అన్నా రాంబాబు ఒకటి తలిస్తే… దైవం మరొకటి తలచింది. దీంతో ఏం చేయాలో తేల్చుకోలేని రాంబాబు…జగన్‌ను కలిసి తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఒక సామాజికవర్గం డబ్బు తీసుకొని ఓట్లు వేయలేదంటూ దుమ్మెత్తి పొశారు రాంబాబు. దీంతో గుర్రుగా వున్న రెడ్డి సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా…వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకుంది. వైసీపీ టికెట్ అన్నాకు కేటాయిస్తే…అశోక్‌రెడ్డికి జై కొట్టాలని ఏకతాటిపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం ఇప్పుడు అన్నా రాంబాబుకు టికెట్ ఇవ్వాలా? వద్దా అన్న సందిగ్దంలో పడినట్టు తెలుస్తోంది.