Gossip Garage Group Politics In Telangana Congress (Photo Credit : Google)
Gossip Garage : తెలంగాణ కాంగ్రెస్ అంటేనే నేతల తలోదారి. అధికారంలో ఉన్నా.. అపోజిషన్‌లో ఉన్నా ఆ పార్టీ నేతల రూటే సెపరేటు. ముందు నుంచే ఒకరంటే ఒకరికి పడదంటే..ఇప్పుడు పవర్‌లో ఉన్నారు. పైగా బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. దాంతో కొత్త, పాత నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందట. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నోళ్లకు, అధికారం వచ్చిన తర్వాత పార్టీలో చేరినోళ్లకు అస్సలు పొసగడం లేదట. గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారడంతో ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడ్డారట పార్టీ పెద్దలు. గొడవలకు చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ కాంగ్రెస్ పెద్దల ఆలోచన ఏంటి.? గ్రూప్ రాజకీయాలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు.?
పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందట..
ప్రతిప్రక్షాల విమర్శలు ఓ వైపు..పార్టీలో గ్రూపు రాజకీయాలు ఇంకోవైపు..తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారాయి. అధికార పార్టీగా అపోజిషన్‌ను ఎదుర్కోవాల్సింది పోయి..అంతర్గత గొడవలు సరిపెట్టలేకపోతున్నారట. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కుదరకపోవడం ఇబ్బందికరంగా మారిందట. గ్రూప్ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. జగిత్యాల ఘటనతో పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందట. పదేళ్ల పాటు తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టి, ఆర్ధికంగా దెబ్బతీసి, కేసులు పెట్టిన బీఆర్ఎస్ నేతలతో కలిసి పని చేయడం కష్టంగా ఉందని పాత క్యాడర్ పీసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయట.
గ్రూపు తగాదాలపై క్లాస్ పీకినా మార్పు రావడం లేదట..
ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, జిల్లాల నాయకులకు గ్రూపు తగాదాలపై క్లాస్ పీకినా మార్పు రాకపోవడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి కొండా సురేఖపై వరంగల్ జిల్లాకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. ఈ వివాదానికి చెక్ పెట్టాలని పీసీసీ చీఫ్ ప్రయత్నిస్తున్నప్పటికీ స్థానిక నేతలు ఆయన ఆదేశాలను లైట్ తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ ముందే గాంధీభవన్‌లో మేయర్ విజయలక్ష్మీ, కార్పొరేటర్ విజయారెడ్డి తిట్టుకోవడం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ గ్రూప్ రాజకీయాలు, దీనికి తోడు మరికొందరు సిటీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారిందట.
ఇంకా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు…
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లోకి రావడాన్ని జీవన్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులకు, సంజయ్ వర్గానికి మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇంతలోనే జీవన్ రెడ్డి అనుచరుడి హత్యతో వివాదం రచ్చకెక్కింది. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి రావడాన్ని వ్యతిరేకించిన సింగిపురం ఇందిర ఇప్పటికీ ఆయనతో కలసి పనిచేయడం లేదు. ఈ ఇద్దరూ నియోజకవర్గంలో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పదవులు ఇస్తున్నారంటూ రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నారు. ఇక గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్న సరితా తిరుపతయ్య మధ్య వార్ ముదిరి పాకాన పడుతోందట.
కొత్త, పాతల మధ్య సయోధ్య కుదుర్చాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు..!
కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయట. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు వివాదాలు వంటి సమస్యలకు చెక్ పెట్టకపోతే స్థానిక సంస్థల్లో నష్టం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారట. కొత్తగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శులు కూడా జిల్లాల్లో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హైకమాండ్‌కు నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పార్టీలో గ్రూప్ పాలిటిక్స్, కొత్త, పాతల మధ్య సయోధ్య కుదుర్చాలని ఏఐసీసీ నుంచి పీసీసీకి ఆదేశాలు అందినట్టుగా చర్చ జరుగుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సూచనతో ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అవగాహన సదస్సు పెట్టాలని పీసీసీ చీఫ్ ఆలోచిస్తున్నారట. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో మీటింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
Also Read : తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇంకెప్పుడు? అసలు అడ్డుకుంటున్నది ఎవరు?