×
Ad

Telangana Local Body Elections: లోకల్ ఫైట్.. బరిలోకి నేతల కూతుర్లు, కుమారులు, భార్యలు.. పొలిటికల్ అరంగేట్రంకు ప్లాన్..

ఇప్పటికే రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటూ..ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు..తమ కూతుర్లు, కుమారులు, కోడళ్లను వారసులుగా పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Telangana Local Body Elections: ఆయన ఎమ్మెల్యే. వాళ్లమెను జడ్పీటీసీ ఛైర్మన్ చేయాలనుకుంటున్నారు. తండ్రి సీనియర్ లీడర్. వారసుడిగా కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం లోకల్ బాడీ ఎన్నికల రంగంలోకి దిగబోతున్నారు. ఒకాయన కోడలను బరిలోకి దింపాలనుకుంటుంటే..మరొకాయన భార్యను పోటీలో పెట్టి గెలిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇలా తెలంగాణలో పలువురు నేతల వారసుల పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వస్తే చాలు..మరింత స్పష్టత రానుంది. స్థానిక పోరులో బరిలో దిగబోతున్న పొలిటికల్ వారసులు ఎవరు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఏంటా ఈక్వేషన్స్?

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ నేతల వారసులు తెర మీదకు వస్తున్నారు. భవిష్యత్‌లో ఎమ్మెల్యేలుగా..ఎంపీలుగా ఉన్నత పదవులు చేపట్టాలని ఆశపడుతున్న రాజకీయ వారసులు..లోకల్ బాడీ పోల్స్‌లో గెలిచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ సలహాదారు..సీఎం రేవంత్‌ సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి కుమారుడిని..గంగారం జడ్పీటీసీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట.

జడ్పీటీసీలుగా గెలిచి పొలిటికల్ అరంగేట్రం చేయాలని ప్లాన్..

మహబూబాబాద్ జడ్పీ పీఠం జనరల్‌ కావడంతో.. ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కొడుకుని బరిలోకి దింపి జిల్లా స్థాయి పోస్ట్‌లో కూర్చోబెట్టాలని ఆశ పడుతున్నారట వేం నరేందర్‌ రెడ్డి. ములుగు జడ్పీ ఛైర్మన్‌ రేసులో మంత్రి సీతక్క కోడలు కుసుమాంజలి పేరు వినిపిస్తోంది. ఇక కామారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ సీటు జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డి పోటీ పడబోతున్నారట.

బీర్కూర్‌ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి జడ్పీ ఛైర్మన్ రేసులో ఉండాలని కలలు కంటున్నారట పోచారం భాస్కర్‌ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు గంప శశాంక్‌ పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారట. నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోడలు, లేదంటే ఆయన భార్యను పోటీలోకి దింపే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.

రంగంలోకి లీడర్ల కూతుర్లు, కుమారులు, భార్యలు..

సంగారెడ్డి జడ్పీ పీఠం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ ​అయింది. ఈ స్థానం కోసం మంత్రి దామోదర రాజనర్సింహ.. తన కూతురు త్రిషను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆమె ఆందోల్ నియోజకవర్గంలోని చౌటకూరు నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తారని లోకల్ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కూడా పోటీలో ఉండబోతున్నారట.

మెదక్ జడ్పీ ఛైర్మన్‌ పదవి జనరల్ ​క్యాటగిరికి రిజర్వ్ ​కావడంతో కాంగ్రెస్‌ నుంచి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఛైర్మన్ పదవి ఆశిస్తున్నారట. ఇదే స్థానం కోసం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండబోతున్నారని టాక్.

రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవి ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య భార్య లేకుంటే కోడలును జడ్పీ ఛైర్మన్‌ బరిలో నిలబెట్టే అవకాశం ఉందట. యాదాద్రి భువనగిరి జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ ​అయింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్న భార్య బీర్ల శివాణి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భార్య బూడిద సువర్ణ బరిలో ఉంటారని టాక్ నడుస్తోంది. ఇక రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్..అంతర్గాం జడ్పీటీసీగా పోటీకి సిద్ధమవుతున్నారట.

ఇప్పటికే రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటూ..ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు..తమ కూతుర్లు, కుమారులు, కోడళ్లను వారసులుగా పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్‌గా ఎమ్మెల్యే టికెట్ అంటే కాస్త కష్టమవుతుందని ..ముందుగా లోకల్ బాడీ ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిపించుకుని వీలైతే..జడ్పీ ఛైర్మన్‌ పీఠంలో కూర్చోపెడితే..తమ వారసులకు పొలిటికల్ ఫ్యూచర్‌కు ఢోకా ఉండదని ప్లాన్‌ చేసుకుంటున్నారట నేతలు. మరి లీడర్లు వేసుకుంటున్న లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుట్ అవుతాయో చూడాలి.

Also Read: రాహుల్ గాంధీ కూడా రక్షించలేరు.. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఓడిస్తా: ప్రశాంత్ కిశోర్ ప్రతిజ్ఞ