TG Ministers Words War: మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌తో తెలంగాణ పాలిటిక్స్‌లో దున్నపోతు చుట్టూ దుమారం నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ మధ్య జరిగిన సంభాషణలో వాడికేం తెలుసు దున్నపోతు అంటూ పొన్నం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఓ రేంజ్‌లో సర్క్యులేట్ అయ్యాయి. దీంతో దళిత మంత్రి మీద బీసీ మంత్రి బాడీ షేమింగ్ అంటూ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది.
జూబ్లీహిల్స్‌లో మైనారిటీ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం కంటే లక్ష్మణ్‌కు అరగంట ఆలస్యమైందట. మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఆ ప్రోగ్రామ్‌కు కాస్త ముందే వచ్చారట. మంత్రి అడ్లూరికి మైనార్టీ నేతలు ఫోన్ చేయగా ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే తనకు అభ్యంతరమేమి లేదని.. తాను చివరలో జాయిన్ అవుతానని చెప్పారట. అ టైమ్‌లో మీడియా మైకుల ముందు లక్ష్మణ్‌ను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడంతో అడ్లూరి ఫీలయ్యారట.
దళిత సంఘాల ఎంట్రీతో రచ్చ రచ్చ..
పొన్నం చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో నొచ్చుకున్నారట. దీంతో డైరెక్ట్ గా పొన్నంకు ఫోన్ చేసిన అడ్లూరి లక్ష్మణ్.. బాడీ షేమింగ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే తాను ఎవరిని దూషించలేదని..సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చినట్లు సమాచారం. దీంతో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ అడ్లూరి ఆగ్రహంగా ఫోన్ పెట్టేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అడ్లూరికి మద్దతుగా దళిత సంఘాలు గళం ఎత్తడంతో ఇష్యూ పెద్దది అయ్యింది. ఇది చాలదన్నట్లు..పొన్నం అపాలజీ చెప్పాలంటూ మంత్రి లక్ష్మణ్ పెట్టిన డెడ్‌లైన్‌తో మంత్రుల మధ్య వైరం ఇంకా రాజుకున్నట్లు అయింది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి..ఇద్దరి మంత్రులకు క్లాస్ తీసుకున్నారట. అంతేకాదు ఆ ఇద్దరి మంత్రులతో భేటీ కానున్నారట పీసీసీ చీఫ్.
పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలకు కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారట. మరోవైపు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై అడ్లూరి అనుచర వర్గం భగ్గుమంటోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన సహచర మంత్రుని దూషించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు మంత్రి వివేక్‌పై కూడా లక్ష్మణ్ అనుచరులు ఫైర్ అవుతున్నారట. దళిత మంత్రిని దూషిస్తుంటే..ఇంకో దళిత మంత్రిగా ఉండి కనీసం వారించకపోవడమేంటని వివేక్ తీరును తప్పు పడుతున్నారట లక్ష్మణ్ సన్నిహితులు.
ఈ వివాదంలో మంత్రి శ్రీధర్ బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. మంత్రి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేస్తుండగా..వివేక్ జోక్యం చేసుకొని శ్రీధర్ బాబు కూడా సమయానికి రారంటూ చెప్పుకొచ్చారట. ఇద్దరి సంభాషణ విన్న శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. సహచర మంత్రులను కలుపుకొని పోయే విధంగా ఉండాలి కానీ..వ్యక్తిగత దూషణలతో అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి నష్టం చేకూర్చొద్దని హితవు పలికారు. లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ సరైన రీతిలో స్పందించాలని కోరారు.
ఇదే అదునుగా మంత్రి శ్రీధర్ బాబు..మనసులోని మాటలను బయట పెట్టేశారు. కరీంనగర్ స్థానికతపై పదేపదే కామెంట్ చేస్తున్న పొన్నం ప్రభాకర్.. అక్కడే పోటీ చేయకుండా పక్క నియోజకవర్గానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కరీంనగర్ హెడ్ క్వార్టర్స్‌లో జెండా ఎగురవేసే అంశంలో ఇతర మంత్రులను దూషించడం సరైంది కాదన్న శ్రీధర్ బాబు..తనకు సూర్యాపేట జిల్లాలో జెండా ఎగరవేసే అవకాశం ఇచ్చారని అది సీఎం ఇష్టం అని చెప్పుకొచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేసిన వివేక్ కూడా రెండో విడతలో మంత్రి అయ్యారు. అయితే ఈ నలుగురిలో శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సన్నిహితంగా ఉంటుండగా..గతంలో ఎంపీలుగా పనిచేసిన పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి క్లోజ్‌గా ఉంటున్నారు. కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జోక్యంపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహంగా ఉన్నారట.
గతంలో సుడా చైర్మన్ వ్యవహారంలో శ్రీధర్ బాబు జోక్యాన్ని తప్పుపట్టారు పొన్నం ప్రభాకర్. తాజాగా సెప్టెంబర్ 17న అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండా ఎగరవేయడంపై కూడా పొన్నం రగిలిపోతున్నారట. కరీంనగర్ సిటీకి చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ సిద్దిపేట జిల్లాలో ఉండగా..ఆయనను ఆ జిల్లాకే పరిమితం చేశారు. దీంతో కరీంనగర్ హెడ్ క్వార్టర్స్‌లో అధికారికంగా జెండా ఎగరవేయలేకపోతున్నానన్న ఆవేదనలో ఉన్నారట పొన్నం. ఇవే కాకుండా కరీంనగర్ జిల్లాలో జరిగే కార్యక్రమాలకు మంత్రులను రానివ్వడం లేదట అడ్లూరి. ఇవన్నీ మనసులో పెట్టుకొనే పొన్నం..అడ్లూరి లక్ష్మణ్‌పై కామెంట్ చేసి ఉంటారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
శ్రీధర్ బాబు, వివేక్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలు..!
ఇక శ్రీధర్ బాబు, వివేక్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ టైమ్‌లో శ్రీధర్ బాబుతో సఖ్యతగా ఉన్న వివేక్..మంత్రి అయ్యాక మళ్లీ పాత ధోరణి ప్రారంభించారన్న వాదన ఉంది. పొన్నం ప్రభాకర్..లక్ష్మణ్‌ను దూషిస్తుండగా..వివేక్..శ్రీధర్ బాబు పేరు ప్రస్తావించడం వెనుక ఆంతర్యం అదే అన్న టాక్ వినిపిస్తోంది. అటు మంత్రి లక్ష్మణ్ కూడా వివేక్ తీరుపై అసంతృప్తితో ఉన్నారట. కాకా వెంకటస్వామి జయంతికి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మణ్ ను ఆహ్వానించకపోవడాన్ని ఆయన సన్నిహితులు తప్పుపడుతున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఇన్వైట్ చేసిన వివేక్ వెంకటస్వామి దళిత మంత్రులను, ఎమ్మెల్యేలను కాకా జయంతి కార్యక్రమానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తున్నారట. మంత్రుల మధ్య పాత వైరం కాస్త..ఇప్పుడు లేటెస్ట్ వ్యాఖ్యలతో చినికి చినికి గాలి వానలా తయారైంది. ఈ వివాదంతో అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న అంచనాతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగారు.
ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌తో మాట్లాడి ఈ వ్యవహారానికి ఇంతటితో చెక్ పెట్టాలని భావిస్తన్నారట. అయితే గతంలో అసెంబ్లీలో మాజీమంత్రి గంగుల కమలాకర్‌ను కూడా పొన్నం బాడీ షేమింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక అంతకముందు మంత్రి కొండా సురేఖ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారితే..ఇప్పుడు పొన్నం కొంత సమస్యలు తెచ్చి పెడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.