చినరాజప్ప ఆశలకు కళ్లెం ! సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తారా?
ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆశలకు ఈసారి కళ్లెం పడునుందా!

ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆశలకు ఈసారి కళ్లెం పడునుందా!
తూర్పుగోదావరి : ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆశలకు ఈసారి కళ్లెం పడునుందా.. సొంత సామాజికవర్గంలోని నేతలు, సొంత పార్టీలోని ముఖ్యనేతలే ఆయన దూకుడుకు బ్రేక్ వేయాలని చూస్తున్నారా.. అసలు పెద్దాపురం నియోజకవర్గంలో ఆయన పట్టునిలుపుకుంటారా.. తూర్పుగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎం వచ్చే ఎన్నికల్లో మరోసారి రంగంలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానంలో హవా కొనసాగించాలని గంపెడాశతో ఉన్నారు. అమలాపురం నుంచి వచ్చిపోటీ మెట్టలో చేసినప్పటికీ ఆయన తొలిసారి ప్రత్యక్ష పోరులో విజయం సాధించారు. ఆఖరి నిమిషంలో రంగంలో దిగినా అనూహ్య విజయం దక్కించుకున్నారు. అంతకుమించి ఏకంగా ఉపముఖ్యమంత్రి హోదా దక్కించుకుని ఏపీ రాజకీయాల్లోనే కీలకనేతగా ఎదిగారు.
వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి టీడీపీ టికెట్ తనకేనని చినరాజప్ప ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయనకు టికెట్ దక్కకుండా చేసేందుకు ప్రత్యర్ధులు పెద్దాపురంలో లోకల్ సెంటిమెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే , సీనియర్ నేత బొడ్డు భాస్కర్ రామారావు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. చినరాజప్పకు మళ్లీ ఛాన్సిస్తే ఓడించి తీరుతామని ఆయన సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెద్దాపురం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్లి, ఆ తర్వాత టీడీపీలో చేరిన బొడ్డు భాస్కర రామారావుకి పెద్దాపురంలో మంచి పట్టుంది. దీంతో ఆయన వ్యతిరేకంగా పనిచేస్తే చినరాజప్పకి చిక్కులు తప్పవు. ఇక నేరుగా బీబీఆర్ బరిలో దిగితే ఓట్ల చీలిక అనివార్యం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చినరాజప్పకు మరో సమస్య కూడా తప్పేలా లేదు. ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం కూడా రాజప్పకు చెక్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా హోం శాఖ మంత్రిగా ఉన్న చినరాజప్ప తీరు పట్ల పద్మనాభం గుర్రుగా ఉన్నారు. దీంతో సన్నిహిత మిత్రులైన బొడ్డు భాస్కర రామారావు, ముద్రగడ కలిసి రాజప్పకు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు మంతనాలు జరుపుతున్న ఈ నేతల ఎత్తులకు .. చినరాజప్ప ఎలాంటి పై ఎత్తులు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.
నియోజకవర్గంలో అభివృద్ధి చూసి పెద్దాపురం వాసులు తనకు పట్టం కడతారని చినరాజప్ప విశ్వాసంతో ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా వందల కోట్లతో పలు కార్యక్రమాలు చేపట్టినట్టు చెబుతున్నారు. కానీ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఆయనకు మింగుడుపడనివ్వడం లేదు. దీంతో పెద్దాపురం పాలిటిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.