నవయుగకు షాక్ : పోలవరం పనులకు తొలగిన అడ్డంకులు

  • Publish Date - October 31, 2019 / 11:57 AM IST

పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగన్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా నిపుణుల కమిటీ వేసింది. పనుల్లో అక్రమాలు జరిగాయనే నిగ్గు తేల్చింది.

వేల కోట్ల రూపాయలు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని..కుడి, ఎడమ కాల్వల అంచనాలు పెంచారని..నిబంధనలకు విరుద్ధంగా ఉందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత ఒప్పందాలను రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో రివర్స్ టెండరింగ్‌ కు మొగ్గు చూపింది జగన్ సర్కార్. దీనిపై పోలవరం ప్రాజెక్టు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందచేసింది. పోలవరం ప్రధాన డ్యాం, హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి నిర్వహించిన రివర్స్ టెండరింగ్ టెండర్ల ప్రక్రియ వల్ల ప్రభుత్వ ఖజానాకు మేలు కలిగిందని, మేఘా సంస్థ 12.6 శాతం తక్కువకే పనులు చేసేందుకు ముందుకొచ్చింది.

అనంతరం నవయుగ కంపెనీ కోర్టు మెట్లు ఎక్కింది. ఆగస్టు 19వ తేదీన రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రభుత్వం అర్ధాంతరంగా ఒప్పందాన్ని రద్దు చేసిందని, కాంట్రాక్టు రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని ఆ సంస్థ తరపు న్యాయవాదులు వాదించారు. 2021 నవంబర్ వరకు కాంట్రాక్ట్ గడువు ఉందన్నారు. రూ.3 వేల 400 కోట్లకు నవయుగ కంపెనీ పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది.

అందులో.. 1,600 కోట్ల మేర పనులు పూర్తి చేసింది. ఇందులో మిగిలిన.. 1,771 కోట్ల పనులకు రీ టెండర్ నిర్వహిస్తున్నారు. ఒక్క దీనికి మాత్రమే రీ టెండర్ పిలిస్తే నష్టాలొస్తాయని భావించి.. హైడల్ ప్రాజెక్ట్ పనులకు కూడా రీ టెండర్ నిర్వహించారు. దీని ద్వారా.. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే డబ్బు మిగిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. 

Read More : బిగ్ బ్రేకింగ్ : పోలవరం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్