If you don't come with the Congress party, people of india never forgive says lalu to oppositions
Lalu Prasad Yadav: భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి కిందకు దింపాల్సిన అవసరం ఉందని, అయితే అందుకు విపక్షాలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాకపోతే, దేశానికి ద్రోహం చేసినట్టేనని, ప్రజలు వారిని క్షమించరని ఆయన అన్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘దేశంలో అనేక మార్పులు జరిగాయి. ప్రజలను మతాలు, కులాలుగా విడదీసి వాళ్లు అధికారం అనుభవిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ, నోళ్లు మూయిస్తూ దేశాన్ని ఏలుతున్నారు. స్వాతంత్ర్య భారతంతో ఎన్నడూ లేనంత అనిశ్చితి, అయోమయ, భయానక వాతావరణం ఇప్పుడు కొనసాగుతోంది. దీనికంతటికీ కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడానికి దేశంలోని విపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రావాలి. ఒకవేళ అలా రాకపోతే దేశానికి ద్రోహం చేసినట్టే. దేశ ప్రజలు వారిని క్షమించరు’’ అని లాలూ యాదవ్ అన్నారు.
కొంత కాలంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశ వ్యాప్తంగా విపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతోనూ చర్చలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇప్పటికే యూపీఏ అనే కూటమి ఉంది. ఇక రాష్ట్రంలో నితీష్, తేజశ్వీ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా కలిసే ఉంది. ఇలాంటి సమయంలో యూపీఏ కాకుండా నితీశ్ కొత్త కూటమి కోసం ప్రయత్నాలు చేయడం, విచిత్రంగా కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చలు చేయడం గమనార్హం. ఇక ఇదే సమయంలో ఒకవైపు నితీశ్‌ను ప్రధాని అభ్యర్థి అంటూనే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమని సమయం దొరకినప్పుడల్లా ఆర్జేడీ చెప్పడం మరోక విశేషం.
Gujarat Polls: ఆప్‌ను అర్బన్ నక్సల్స్‌తో పోలుస్తూ విరుచుకుపడ్డ ప్రధాని మోదీ