రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, వేల కోట్లతో రాజధాని నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని సమాచారాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. రాజధాని విషయంలో మరో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి ఆకమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జనవరిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదని మంత్రి వివరించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసే హై పవర్ కమిటీలో మంత్రులు, అధికారులు ఉంటారని నాని తెలిపారు. జనవరి3న బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చే నివేదిక, జీఎన్ రావు కమిటీ నివేదిక, శివరామకృష్ణ కమిటీ నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసి మూడు వారాల్లో తుది నివేదిక ఇస్తుందని దాని ఆధారంగానే రాజధాని అంశంపై సీఎం ప్రకటన చేస్తారని ఆయన వివరించారు.
జనవరి20 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 3రాజధానుల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. రాజధానిని మార్చటం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాకే రాజధానిని మార్పు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 54 వేల ఎకరాల్లో లక్ష10వేల కోట్ల పై చిలుకు అంచనాలతోఅప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధానినిర్మాణం చేపట్టిందని 5 ఏళ్లలో 5వేల400 కోట్లతో చేపట్టిన పనులే పూర్తి కాలేదని.. వాటికివడ్డీలు కట్టటమే సరిపోతోందని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పటి పురపాలక శాఖమంత్రి నారాయణ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన అంచనాల నివేదికతో రాజధానినిర్మాణం మొదలుపెట్టారని , అందులో 10 శాతం విశాఖపట్నంలో ఖర్చు చేస్తే హైదరాబాద్ లాంటిరాజధానిని నిర్మించవచ్చని ఆయన చెప్పారు.
ప్రజాసంక్షేమం కోసం పని చేస్తున్నజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పధకాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని పేర్ని నాని చెప్పారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అవసరాల కోసం ఏడాదికి రూ.25 వేల కోట్లు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.12వేల కోట్లు, ఆస్పత్రుల రిపేరుకు రూ.14వేల కోట్లు, ఆరోగ్యశ్రీలో పేదల ఆరోగ్యం కోసం రూ.3150 కోట్లు, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమకు నీరు అందించేందుకు ప్రాజెక్టులకు మరో లక్ష కోట్లు, అమ్మఒడి పధకం అమలుకు మరో రూ.6500 కోట్లు అవసరం ఉంది.
అలాగే పేదల ఇళ్లస్ధలాలకు రూ. 45వేల కోట్లు, ఇళ్లనిర్మాణానికి రూ.9వేల కోట్లు అవసరం ఉందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రజలకు శుధ్ధిచేయబడిన తాగునీరు పంపణీ కోసం కోసం రూ.40వేల కోట్లు అవసరం ఉందని…సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమానికి మరో రూ.35వేల కోట్లు అవసరం ఉందన్నారు.
పేదలకు తక్కువ ధరకే బియ్యాని అందించటానికి మరో రూ.10వేలకోట్లు, విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ కు రూ.6వేల కోట్లు అవసరంతోపాటు గ్రామాల్లో రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, రైతులకు పగటి పూట విద్యుత్ అందచేయటానికి మరో రూ.3 వేల కోట్లు అవసరం ఉంటుందని, వీటితో పాటు రాజధాని నిర్మాణానికి తేవాల్సిన అప్పులు..వాటికి చెల్లించాల్సిన వడ్డీలపై మంత్రి మండలి సమగ్రంగా చర్చించిందని పేర్ని నాని వివరించారు.