Chandrababu Naidu
Chandrababu Naidu : ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మళ్లీ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడం జరిగింది. గతంలో వైజాగ్ లో పవన్ కల్యాణ్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం, ఆరోజు జరిగిన ఘటనలకు సంబంధించి విజయవాడ నోవాటెల్ హోటల్ కి ప్రత్యేకంగా వెళ్లి పవన్ ను పరామర్శించారు చంద్రబాబు. ఆ తర్వాత హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పని చేయాలని అప్పుడే చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జీవో 1పై విరుచుకుపడ్డారు.(Chandrababu Naidu)
Also Read..Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?
ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పని చేస్తామని మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ చెప్పారు. కేవలం రాజకీయ పరిణామాలపైన మాత్రమే చర్చించామని, పొత్తుల గురించి చర్చ జరగలేదని నాడు వారిద్దరూ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు నాడు చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఎక్కడా తిరగనివ్వడం లేదని.. సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని, ఏపీలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన నడుస్తోందని గతంలో చంద్రబాబు, పవన్ చెప్పారు. అదే సమయంలో, ఇకపై తాము తరుచుగా కలుసుకుంటామని ఆ రోజే పవన్, చంద్రబాబు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ భేటీ అయినట్లు తెలుస్తోంది.
ఇక, ఇటీవల ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగ్గా, ఆ సమయంలోనూ పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకి మద్దతుగా, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అప్పటి నుంచి చంద్రబాబుని కలవాలని పవన్ అనుకుంటున్నారు. అయితే షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల సాధ్యం కాలేదు. ఇవాళ(ఏప్రిల్ 29) చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. నిన్న ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ఇవాళ మధ్యాహ్నమే హైదరాబాద్ చేరుకున్నారు. పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చిస్తున్నారు.
ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన పవన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలిశారు. పలు అంశాలపై నడ్డాతో చర్చించారు. నడ్డాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలన రహిత ఏపీ తమ లక్ష్యం అని పవన్ కల్యాణ్ అన్నారు. అంతేకాదు, ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము అని నాడు తేల్చి చెప్పారు పవన్. నాడు బీజేపీ పెద్దలతో చర్చించిన అంశాలను నేటి భేటీలో చంద్రబాబుకి పవన్ కల్యాణ్ వివరించినట్లు సమాచారం.
ఇటీవల ఓ జాతీయ చానెల్ చర్చా వేదికలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాని మోదీ విజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీ పాలనపై సానుకూలంగా స్పందించారు చంద్రబాబు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. తమతో కలిసి బీజేపీని కూడా ప్రయాణించేలా చంద్రబాబు, పవన్ ప్రయత్నం చేస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలనే భావన చంద్రబాబు, పవన్ లో కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.