ఎన్నికలు ముందుకొస్తున్న తరణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ కూడా గురువారం ఉదయం వైఎస్ జగన్‌ను కలిసి.. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నార్నెతో పాటూ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా వైసీపీలో చేరారు. ఈ సంధర్భంగా వైసీపీలో చేరిన తర్వాత నార్నె శ్రీనివాస్ మాట్లాడుతూ.. పదేళ్లగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నానని, వైసీపీలో చేరడానికి జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్ధేశ్యంతోనే వైసీపీలో చేరానని నార్నె శ్రీనివాస్ ప్రకటించారు. నార్నె శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా దగ్గర బంధువు. నార్నె కూతురు లక్ష్మీ ప్రణతిని జూ.ఎన్టీఆర్ కు ఇచ్చి వివాహం చేయించింది చంద్రబాబేనని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. గతంలో ఎలక్ట్రానిక్ మీడియా సంస్థను నడిపిన నార్నె 2014లో వైసీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు వైసీపీ నుంచి అవకాశం దక్కినట్లు భావిస్తున్నారు.