సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేటి నుంచి 5 రోజులపాటు చండీయాగం నిర్విహిస్తున్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లి లోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు యాగం ప్రారంభమవుతుంది.
మెదక్: రాష్ట్రం సుభిక్షంగా ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అంది, బంగారు తెలంగాణ కల సాకారం కావాలని కోరుతూ సీఎం కేసీఆర్ తలపెట్టిన మహారుద్ర సహస్ర చండీయాగం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ లో ఐదురోజుల పాటు ఈయాగాన్ని నిర్వహించనున్నారు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆశీస్సులతో విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర పర్యవేక్షణలో ఐదురోజుల పాటు చతుర్వేద, పురస్సర, మహారుద్ర సహస్ర చండీయాగాలు చేస్తారు. మూడు యాగశాలల్లో ఏర్పాటు చేసిన 27 హోమ గుండాల వద్ద 300 మంది రుత్వికులు పూజల్లో నిర్వహిస్తారు.
మొదటిరోజు యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గోంటారు. ఉదయం గణపతి పూజ అనంతరం పుణ్యహవచనం, రుత్వికహవనం, యాగశాల ప్రవేశం, గోపూజ కార్యక్రమాలు జరుగుతాయి. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యాగాన్ని, పూజ కార్యక్రమాలను మాణిక్య శర్మ, సోమయాజులు, నరేంద్ర కాప్రేలతో పాటు శృంగేరీ పీఠం పండితులు ఫణిశశాంక శర్మ, గోపికృష్ణ శర్మ, పురాణం మహేశ్వర శర్మలు పర్యవేక్షించనున్నారు. యాగంలో పాల్గోనాలని సీఎం కేసీఆర్ గవర్నర్ దంపతులను కోరారు. ఈ నెల 23,24,25 తేదీల్లో ఒకరోజు వారు హజరయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ యాగానికి ఆహ్వానించారు.
సకల సౌకర్యాలు.. పటిష్ట భద్రత
యాగం నిర్వహించడానికి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ల నుంచి వచ్చిన 300 మంది రుత్వికులు శని, ఆదివారాల్లో ఫాంహౌస్‌కు చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఎర్రవల్లి గ్రామ పూజారులు, మండలానికి చెందిన పండితులు కూడా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఐదు రోజుల పాటు యాగంలో ఈ రుత్వికులు అందరూ పాల్గొంటారు. సంప్రదాయం ప్రకారం ఎర్రవల్లిలోని గ్రామదేవతలకు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ, గడిమైసమ్మ, బొడ్రాయి, మహంకాళమ్మ, హనుమాన్ ఆలయాల వద్ద ఈ పూజలు జరిగాయి. గ్రామస్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రం చుట్టూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలను బందోబస్తు లో పాల్గోంటున్నారు. కాగా, యాగానికి రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పలువురు పెద్దసంఖ్యలో హాజరు కానున్నట్టు తెలిసింది. ఈ మహాక్రతువు కోసం 10రోజులుగా యాగశాలలు సిద్ధం చేస్తున్నారు.
ఈ 5 రోజులు చండీయాంగతో పాటు అనుబంధ యాగాలు కూడా నిర్వహించనున్నారు. అనుబంధ యాగాలను 100 మంది రుత్వికులు పర్యవేక్షిస్తారు. మహారుద్రం, రాజశ్యామల, పీతాంబరీదేవి, అనుష్ఠానం, సూర్యయాగం, నవగ్రహ యాగం, సూర్య అనుష్ఠాలు, వాస్తు, గణపతి వంటి అనుబంధ యాగాలు నిర్వహించనున్నారు. మహారుద్రం, భగలాముఖి నవగ్రహ, చతుర్వేద పారాయణం వంటివి భాగంగా ఉంటాయి. అనుబంధ యాగాలు నిర్వహించడానికి వేరుగా ఏర్పాటు చేశారు.