సీఎం కేసీఆర్ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్నారు. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించారు.
2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం కరీంనగర్ నుంచి ఉదయం హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరుతారు. ఉదయం 9.40కి కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ కాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన వెళ్లి గోదావరి ఘాట్‌ను పరిశీలిస్తారు. ఉదయం 10.30కి మేడిగడ్డకు చేరుకుంటారు. బ్యారేజీని పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో నీటి నిల్వ.. తరలింపు అంశాలపై మాట్లాడుతారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారు సీఎం కేసీఆర్.
* గతేడాది జూన్ 21న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు.
* ప్రాజెక్టులోని నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి.
* కాళేశ్వరం జలాలు మిడ్ మానేరు వరకు చేరుకున్నాయి.
* కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద బాహుబలి మోటార్, ఆసియాలోనే అతి పెద్ద ఓపెన్ సర్జ్ పూల్ నిర్మాణాలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.
* లక్ష్మి పంప్ హౌజ్‌లో అలాంటి రికార్డును మరోకటి నెలకొల్పడానికి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు సమాయత్తమవుతున్నారు.
* పంప్ హౌజ్ లోని 11 మోటర్ల ను ఆన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోసి రికార్డు నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్‌లో నీటి నిల్వ పెరుగుతోంది. నవంబర్ 21 నుంచి బ్యారేజ్ 85 గేట్లను మూసి వేసి నీటి నిల్వ పెరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. 16.17 టిఎంసిల సామర్థ్యం కలిగిన బ్యారేజ్ లో ప్రస్తుతం 13 టిఎంసిల నీటి నిల్వ ఉంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేస్తుండడంతో ప్రాజెక్టు నుంచి లక్ష్మి పంప్ హౌజ్ వరకు 17 కిలో మీటర్ల మేర బ్యాక్ వాటర్ పెరిగింది.
గోదావరి నది మీద నిర్మిస్తోన్న తుపాకుల గూడెం బ్యారేజీకి వనదేవత సమ్మక్క పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న స్థాయిలో సాగునీరు చేరుకుంటుందన్నారు సీఎం కేసీఆర్. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖకు సూచించారు.