వైసీపీలో మార్పులు.. సంబరపడిపోతున్న ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

మార్పు మంచిదే అంటున్న ఆ ఇద్దరు ఎవరు? మార్పుతో రాజకీయ కూర్పు ఎలా మారింది..?

YCP Incharge Changes : మార్పుచేర్పుల ఎఫెక్ట్‌తో జాక్‌పాట్‌ కొట్టారు ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే.. అసమ్మతులు.. అసంతృప్తుల తలనొప్పులు తగ్గిపోయి.. కొత్త ప్లేస్‌లో సేఫ్‌గా రాజకీయం చేసుకుంటున్నామని తెగ హ్యాపీ అవుతున్నారట ఆ ఇద్దరు.. ఒకరు స్వయంగా మార్పు కోరుకుంటే.. ఇంకొకరు ముందు కస్సుబుస్సులాడినా.. ఆ తర్వాత కొత్త స్థానమే కంఫర్ట్‌గా ఉందని సంబరపడిపోతున్నారు. మార్పు మంచిదే అంటున్న ఆ ఇద్దరు ఎవరు? మార్పుతో రాజకీయ కూర్పు ఎలా మారింది..?

ఉమ్మడి పశ్చిమలో మార్పులతో మంచి ఫలితాలు!
వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుచేర్పులు ఎన్నో తలనొప్పులు తెస్తున్నాయి. చాలా చోట్ల ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకు కారణమయ్యాయి. కానీ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం మార్పులు బాగా వర్క్‌అవుట్‌ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రెండు ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో చేసిన మార్పులతో అక్కడి అసంతృప్తి స్వరాలకు ఫుల్‌స్టాప్‌ పడటంతోపాటు ప్రత్యర్థి పార్టీల్లోని అసమ్మతులు వైసీపీకి సహకరించే పరిస్థితిని తెచ్చిందని అంటున్నారు.

కొవ్వూరులో గ్రూప్‌ వార్‌కు శుభం కార్డు
ముఖ్యంగా హోంమంత్రి తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గానికి మారడం మంచి ఫలితాలిచ్చేలా కనిపిస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వనితకు.. ఆ నియోజకవర్గంలో చాలా తలనొప్పులు ఎదురయ్యాయి. ఆమె సొంత నియోజకవర్గం గోపాలపురం కావడంతో ఈసారి అక్కడికే మారిపోవాలని ప్రయత్నించారు. అధిష్టానం కూడా ఆమెకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కొవ్వూరులో గ్రూప్‌ వార్‌కు శుభం కార్డు పడినట్లైంది. పైగా గోపాలపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే తలారి వెంకటరావును కొవ్వూరు మార్చడం వల్ల స్థానికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదంటున్నారు.

Also Read : వైసీపీలో మార్పుల మంటలు.. మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ఎమ్మెల్యే తలారికి జైకొడుతున్న వైసీపీ నేతలు
ఇక గోపాలపురం నుంచి కొవ్వూరు మారిన ఎమ్మెల్యే తలారి వెంకటరావుకు కూడా అక్కడి నాయకులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రి వనితకు సహకరించని వారు సైతం ఎమ్మెల్యే తలారికి జైకొడుతుండటంతో ఆయన కూడా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారని అంటున్నారు. ముందు అయిష్టంగా కొవ్వూరు వెళ్లిన వెంకటరావు.. అక్కడి నేతల ఆదరణతో ఖుషీగా ఫీల్‌ అవుతున్నారట. గోపాలపురం కన్నా తనకు కొవ్వూరు బెటర్‌ అనే భావనకు వచ్చిన వెంకటరావు.. నియోజకవర్గంలో దూసుకుపోయేలా కార్యక్రమాలు చేస్తున్నారు.

Also Read : ఆయన ఆశీస్సులు ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్..! నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు

టీడీపీ ప్రధాన వర్గం.. వనితకు పరోక్షంగా సహరించే అవకాశం
ఇదే సమయంలో గోపాలపురం నియోజకవర్గానికి వనిత రావడం టీడీపీలో కూడా ఓ గ్రూప్‌ను తెగ ఆనందానికి గురిచేసిందట. గతంలో టీడీపీలో పనిచేసిన వనితకు.. ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకటరాజును పార్టీలో ఓ ప్రధాన వర్గం వ్యతిరేకిస్తోంది. వీరంతా వనితకు పరోక్షంగా సహరించే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. టీడీపీ ఇన్‌చార్జి వెంకటరాజును మార్చాలని.. లేదంటే రెబల్‌ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నేత ముళ్లపూడి బాపిరాజు వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వనిత రావడంతో టీడీపీ తిరుగుబాటు నేతలకు మంచి ఆప్షన్‌ లభించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి వైసీపీ మార్పులు వల్ల గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అంతా సెట్‌ అయినట్లే కనిపిస్తోంది. ఇక ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు