అనంత టీడీపీలో వర్గ పోరు.. భగ్గుమన్న విభేదాలు!

  • Publish Date - July 7, 2020 / 08:12 PM IST

గత ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో టీడీపీదే హవా. కానీ ఇప్పుడు పరిస్థితుల మారిపోయాయి. ముఖ్య నేతలంతా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలో వర్గ పోరు మొదలైంది. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం, శింగనమల, పెనుకొండ నియోజకవర్గాల్లో ఇంటిపోరు తారస్థాయికి చేరింది.

ఇటీవల అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ ఎక్కడికక్కడ తమ ఇళ్లలోనే దీక్షలను చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. కానీ, చాలాచోట్ల నేతలు మాత్రం దీక్షల కార్యక్రమాన్ని తమ బలాన్ని ప్రదర్శించేందుకు… అసమ్మతి గొంతు వినిపించేందుకు వాడుకున్నారట.

శింగనమలలో ఇన్‌చార్జ్ శ్రావణికి వ్యతిరేకంగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షడు ఎంఎస్ రాజు నియోజకవర్గంలో దీక్షా కార్యక్రమాలే కాదు… ఏ చిన్న సంఘటన జరిగినా శ్రావణికి పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ వివాదం పార్టీ నాయకత్వ దృష్టికి వెళ్లింది. జిల్లాలో పార్టీని కంట్రోల్ చేయాల్సిన జిల్లా అధ్యక్షడు పార్థసారథికి కూడా కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రూపంలో అసమ్మతి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

పార్థసారథికి వ్యతిరేకంగా పెనుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సవితమ్మ. ఆమె చేపడుతున్న కార్యక్రమాలపై గుర్రుగా ఉన్న పార్థసారథి పార్టీ అదిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని ఫీలవుతున్నారట.

గత ఎన్నికల ముందు ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇప్పిస్తానని మాట ఇచ్చిన పార్థసారథి.. చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపడంతో సవితమ్మ సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారట.

సొంత సామాజికవర్గం కావడం, నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉండడంతో సవితమ్మ అసమ్మతి కార్యక్రమాలపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు పార్థసారథి. తాను ఎక్కడా అసమ్మతి కార్యక్రమాలు చేయడం లేదని, పార్టీ పిలుపుతో కార్యక్రమాలు చేపడుతున్నానని అంటున్నారు సవితమ్మ. కళ్యాణదుర్గంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

మాజీ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర నాయుడు మధ్య వివాదం తీవ్రమయ్యింది. గత ఎన్నికల నుంచి ఇరువర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. తన ఓటమికి హనుమంతరాయ చౌదరి కూడా కారణమని చెబుతూ పార్టీ అధిష్ఠానానికి ఉమామహేశ్వర నాయుడు ఫిర్యాదు చేసినా పార్టీ పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉమా వర్గీయులు. బలమైన జిల్లాలో ఈ విభేదాలు పార్టీ కొంప ముంచే అవకాశాలున్నా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారట.

ఈ మూడు నియోజకవర్గాల్లో మొదలైన గొడవలు రానురాను మిగిలిన నియోజకవర్గాలకు కూడా పాకే అవకాశముంది. ఇప్పటి నుంచే పార్టీని పటిష్టపరిచేలా నాయకత్వం చొరవ చూపకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదంటున్నారు పార్టీ కార్యకర్తలు, నేతలు.

అసమ్మతి నేతలు మాత్రం పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తప్పితే ఎక్కడా అసమ్మతి కార్యక్రమాలు చేయటం లేదంటున్నారు. చూడాలి మరి అధినాయకత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో?