ఆ ఒకే ఒక్కడు ఎవరు? బీఆర్ఎస్‎ నుంచి రాజ్యసభకు వెళ్లేది అతడేనా?

తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు.

Rajya Sabha Elections 2024

Rajya Sabha Elections 2024 : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గులాబీ పార్టీలో సందడి మొదలైంది. ఈసారి పెద్దల సభకు వెళ్లేదెవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో ఎమ్మెల్యేల బలాన్ని బట్టి గులాబీ పార్టీకి ఒకే ఒక్క రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది.

రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, రవిచంద్ర పదవీ కాలం ఏప్రిల్ తో ముగియనుంది. ఈ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!

గులాబీ పార్టీలో ఆ ఒక్కరు ఎవరు?
2018లో జరిగిన ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ దక్కించుకున్న బీఆర్ఎస్.. మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. తాజాగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారడంతో రాజ్యసభ స్థానాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. శాసనసభ్యుల సంఖ్యా బలాన్ని పరిగణలోకి తీసుకుంటే.. రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, ఒక స్థానం బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే, గులాబీ పార్టీలో ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రవిచంద్రకు మరో ఛాన్స్?
పదవీ కాలం ముగుస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ తమ ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక, అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. మిగిలిన రెండేళ్ల కాలానికి వద్దిరాజు రవిచంద్రకు ఉపఎన్నికలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్రకు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.

Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!

రేసులో సీనియర్ నేతలు..
బలమైన సామాజిక వర్గం కావడం, పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు వస్తుండటంతో బలహీన వర్గాల్లో బలమైన సామాజిక నేపథ్యం ఉన్న వద్దిరాజు వైపు పార్టీ మొగ్గుచూపుతోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రవిచంద్రను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీ భావిస్తే ప్రత్యామ్నాయంగా సీనియర్ నేతలైన పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాసానికి ఛాన్స్ దక్కుతుందా?
ఒకవేళ జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి లేదా నాగం జనార్దన్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కీలక సామాజికవర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆరోపణలను బీఆర్ఎస్ ఎదుర్కొంది. ఈ కారణంగా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు ఛాన్స్ దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మొత్తంగా వీరందరిలో ఎవరివైపు గులాబీ అధిష్టానం మొగ్గు చూపిస్తుంది అనేది వేచి చూడాలి.