వెరైటీ ఎన్నిక : మాక్ పోలింగ్ ద్వారా సర్పంచ్ ఎన్నిక
నిర్మల్ జిల్లాలోని తాంశ గ్రామంలోనూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కానీ ఆ ఎన్నికే కాస్త వెరైటీగా సాగింది.
నిర్మల్ జిల్లాలోని తాంశ గ్రామంలోనూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కానీ ఆ ఎన్నికే కాస్త వెరైటీగా సాగింది.
నిర్మల్ : తెలంగాణలో చాలా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతున్నాయి. గతంలో పోల్చితే ఈసారి ఎక్కువ గ్రామాల్లో సర్పంచ్‌ను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అయితే నిర్మల్ జిల్లాలోని తాంశ గ్రామంలోనూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కానీ ఆ ఎన్నికే కాస్త వెరైటీగా సాగింది. అదెలాగో తెలుసుకోవాలంటే.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు గడువు కూడా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో నువ్వానేనా అన్నట్టు పోటీదారులు ఎన్నికల్లో పోటీపడుతుంటే .. మరికొన్ని గ్రామాల ప్రజలు పోటీలేకుండా ఎకగ్రీవం చేసుకుంటున్నారు. ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే పది లక్షల రూపాయలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తాంశ గ్రామం కూడా తమ సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంది. కానీ ఆ ఎన్నికే వెరైటీగా జరిగింది.
సర్పంచ్‌ను ఎకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం 10లక్షల నజరానా ఇస్తుంది. అంతేకాదు.. మాజీ మంత్రి , నిర్మల్ ప్రస్తుత ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి ఏకగ్రీవం చేసిన గ్రామాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి మరో పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. దీంతో తాంశ గ్రామ ప్రజలు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చే పది లక్షలు, ఇంద్రకరణ్‌రెడ్డి ఇచ్చే మరో పది లక్షలు.. మొత్తం 20లక్షలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించుకున్నారు. సర్పంచ్‌ను ఎవరిని ఎన్నుకోవాలనే దగ్గరే వారికి అసలు సమస్య వచ్చి పడింది. ఎందుకంటే సర్పంచ్ పదవి రేస్‌లో చాలా మంది పోటీదారులు ముందుకు వచ్చారు. వీరిలో ఎవరిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలో మొదట వారికి అర్థంకాలేదు. కానీ గ్రామస్తులంతా ఓ చక్కని నిర్ణయంతో సర్పంచ్ ఎన్నికను పూర్తి చేశారు.
తాంశ గ్రామంలో మొత్తం జనాభా 500 మంది ఉన్నారు. వీరిలో 350 ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ పదవి ఆశిస్తున్న వారికి గ్రామస్తులంతా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని తీర్మానించారు. అనుకున్నట్టుగానే సర్పంచ్ పోటీదారులందరికీ మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇందులో అత్యధికంగా 190 ఓట్లు సాధించిన విజయలక్ష్మి అనే మహిళను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాక్ పోలింగ్ నిర్వహించినా ప్రజాస్వామ్య బద్దంగా నిజమైన ఎన్నికలనే తలపించాయి.
మొత్తానికి తాంశ గ్రామస్తులు ఎన్నికల బరిలోకి వెళ్లకుండానే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీదారులెంతమంది ఉన్నా.. తమ గ్రామానికి సరైన సర్పంచ్‌ను ఎన్నుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చే 10లక్షల నిధులనూ వారు గెల్చుకున్నారు. మొత్తంగా తాంశ గ్రామ ప్రజల చైతన్యం ఊరి అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది.