పర్చూరులో దగ్గుబాటి కుటుంబం పట్టునిలుపుకోవడానికి ప్రయత్నిస్తోందా?
ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి కుటుంబం పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోందా ?

ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి కుటుంబం పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోందా ?
ప్రకాశం : జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి కుటుంబం పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోందా ? దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడంతో…జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు జరగనున్నాయి. దగ్గుబాటి ఎంట్రీతో సిట్టింగ్ ఎమ్మెల్యే సాంబశివరావుకు…కష్టాలేనా ? హితేశ్ చెంచురామ్ విజయం నల్లేరు మీద నడకేనా ? జిల్లాలో ఎక్కడ చూసినా…ఇప్పుడిదే చర్చ.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తప్పిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు…కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. అందరూ ఊహించినట్లే….వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దగ్గుబాటి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో…జిల్లాలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. దగ్గుబాటికున్న బలంతో…టీడీపీని మట్టి కరిపించాలని వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దగ్గుబాటికి ఎలాగైనా చెక్ పెట్టాలన్న లక్ష్యంతో…టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావును క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకొని….పార్టీ గెలుపునకు ఏం చేయాలో ప్లాన్ రెడీ చేశారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకోవడం వెనుక వైసీపీ భారీ ప్రణాళిక వేసింది. పర్చూరు, అద్దంకి, చీరాలలో పార్టీ బలోపేతానికి దగ్గుబాటి కుటుంబం చరిష్మా ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. హితేశ్ వైసీపీలో చేరితే అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో కొంత మేర రాజకీయాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా బలంగా ఉన్నారు. వారికి ధీటుగా పోటీ ఇచ్చేందుకు వైసీపీలో సరైన నేతలు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. ఇలాంటి పరిస్థితుల్లో దగ్గుబాటి కుటుంబం పలుకుబడికి తోడు మంచి అభ్యర్థులను రంగంలోకి దించవచ్చన్న అంచనా వేసుకుంది వైసీపీ.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు,హితేశ్ చెంచురాం… వైసీపీలోకి ఎంట్రీ బాగానే ఉన్నా….పార్టీ గెలుపుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంతోకాలంగా అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్న దగ్గుబాటి….చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హితేశ్ గెలుపుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి హడావిడి లేకుండా రాజకీయం నడిపే వ్యక్తిగా దగ్గుబాటికి పేరుంది. పైగా సామాజికవర్గం ఓట్లు పడతాయన్న ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే…హితేశ్ చెంచురామ్‌కు పౌరసత్వ సమస్య పోటీకి అడ్డంకిగా మారింది. అమెరికా పౌరసత్వం ఉండటంతో….ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఎలాగైనా రద్దు చేసుకోవాలని భావిస్తున్నారు. ఇది కుదరకపోతే ఎన్నికల రంగంలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
దగ్గుబాటి వైసీపీలో చేరిక అంశం అలా ఉంటే….పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతారని ప్రకటించడం పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. పురందేశ్వరి కూడా వైసీపీ కండువా కప్పుకుంటే మంచిదని పార్టీ శ్రేణులతో పాటు దగ్గుబాటి అనుచరులు అభిప్రాయపడుతున్నారు. పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగితే….వైసీపీకి నష్టమేనని చెబుతున్నారు. దీనికి తోడు దగ్గుబాటి వైసీపీలోకి రాకను నిరసిస్తూ….పర్చూరు వైసీపీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామనాథంబాబు ఇటీవలే సమావేశం నిర్వహించారు. మూకుమ్మడిగా దగ్గుబాటి వైసీపీ ఎంట్రీని వ్యతిరేకించారు. ఇంతకాలం పని చేసిన తమకు అన్యాయం చేస్తారా అంటూ రామనాథంబాబు నిలదీశారు. కేడర్ కాపాడుకునేందుకు కోట్లు ఖర్చు చేశామని ఇప్పుడు కొత్తగా చేరిన దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పర్చూరు నుంచి వైసీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగినా…గెలుపు అంత సులువు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్న రామనాథంబాబు సహకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.