Thalapathy Vijay New Political Party
Thalapathy Vijay : తమిళనాట మరో కొత్త హీరో పార్టీని ప్రకటించబోతున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు ఇలయ దళపతి విజయ్. మరో నెల రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత గురువారం తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం అయిన దళపతి.. కొత్త పార్టీ ఆలోచనను వారితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో దళపతి విజయ్.
తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత స్టార్ డమ్ ఉన్న హీరో విజయ్. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూడా విజయ్ రాజకీయ అరంగ్రేటంపై ప్రకటన చేశారు. కానీ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల విజయ్ ఆ ప్రకటనపై అవునని కానీ కాదని కానీ స్పందించలేదు. కానీ గత కొంతకాలంగా దళపతి అడుగులన్నీ రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమనే సంకేతాలే ఇస్తున్నాయి.
Also Read : మోదీని గెలిపించేది ‘ఇండియా’ కూటమే? ఏం జరుగుతుందో తెలుసా?
జనవరి 25 గురువారం నాడు చెన్నైలోని తన అభిమానలతో సమావేశం అయ్యారు విజయ్. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి దాదాపు 150 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి రాగా, తన పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయ్ అభిమాన సంఘంతో పాటు విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట కొత్త పార్టీని రిజిస్ట్రర్ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దళపతి విజయ్ అభిమానుల సమావేశం, కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి విషయాలపై తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అవుతున్నాయి. దళపతి విజయ్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వచ్చే నెల రోజుల్లో పార్టీకి సంబంధించిన అధికారిక లాంఛనాలు అన్నీ పూర్తి చేయాలని తన అభిమాన సంఘానికి విజయ్ సూచించినట్లు తెలుస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పార్టీ ఏర్పాటు ప్రకటన చేయాలని, రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని దళపతి వ్యూహంగా చెబుతున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పక్షాలతో బీజేపీ ‘సేఫ్ గేమ్’.. అంతుచిక్కని కమలనాథుల వ్యూహం