INDIA alliance: మోదీని గెలిపించేది ‘ఇండియా’ కూటమే? ఏం జరుగుతుందో తెలుసా?

ఇండియా కూటమి భాగస్వాముల విచ్ఛిన్న వైఖరి... బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది.

INDIA alliance: మోదీని గెలిపించేది ‘ఇండియా’ కూటమే? ఏం జరుగుతుందో తెలుసా?

INDIA alliance

Updated On : January 25, 2024 / 8:40 PM IST

‘‘ఇంతన్నాడు.. అంతన్నాడే గంగరాజు..! ఓ లమ్మో.. ఓ లప్పో… ముంతమామిడి పండన్నాడే గంగరాజు..! ఓ లమ్మో ఒంటరిగా వదిలేసి ఎల్పోనాడే గంగరాజు..’’ రెండేళ్ల క్రితం రిలీజైన ఓ తెలుగు సినిమాలోని ఈ పాటలాగా ఉంది ప్రతిపక్ష ఇండియా కూటమి తాజా పరిస్థితి.

ప్రధాని మోదీని ఓడించడమే లక్ష్యం అంటూ.. గొప్పలు చెబుతూ ఇండియా కూటమి కట్టిన పార్టీల తాజా వ్యవహారశైలిని చూస్తే.. మోదీని గెలిపించడానికే ఈ కూటమిలోని పలు పార్టీలు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందరూ కలిసి ఢీకొట్టినా… మోదీని ఓడించడం అసాధ్యమని భావిస్తున్న తరుణంలో… ఇండియా కూటమిలోని పలు పక్షాలు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ.. ఇండియా కూటమిని మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేస్తున్నాయి.

బెంగాల్‌లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులను కలుపుకునేది లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. పంజాబ్‌లో తాము ఒంటరిగానే అన్నిస్థానాల్లో పోటీకి దిగుతామని ఆప్‌ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా ఢంకా భజాయించారు.

ఇక అవకాశవాదానికి మారుపేరయిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తాజా అడుగులు చూస్తే.. అక్కడ ఆర్‌జేడీతో తెగతెంపులు చేసుకుని, మళ్లీ బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకునే అవకాశం కన్పిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీచేసిన నితీశ్‌కుమార్‌, కొంతకాలం క్రితం బీజేపీతో విభేదించి.. ప్రతిపక్ష ఇండియా కూటమితో జతకట్టారు.

మొదటి నుంచి ఇంతే..

మొదటి నుంచి అనుమానాస్పదంగానే వ్యవహరిస్తున్న నితీశ్‌కుమార్‌ ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశం తర్వాత కొత్తరూటుకు రంగం సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇండియా కూటమి తనను నెత్తినపెట్టుకొని.. మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్‌ చేయాలన్నది నితీశ్‌కుమార్‌ కోరిక. ఇందుకు ఇండియా కూటమిలో మద్దతు రాకపోవడంతో.. ఆయన తన దారి తాను చూసుకొని, మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ వ్యవహారశైలి కూడా ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. ఆయన మనసులో ఒకటుంటుంది.. పైకి మరొకటి చెబుతారు. ఎవరెవరితోనో ఆయనకు లోపాయికారీ ఒప్పందాలు ఉంటాయి. ఇలాంటి భాగస్వాములు ఉన్న, ప్రతిపక్ష ఇండియా కూటమి…. నిజంగా ముందుకు వెళ్తుందా అంటే నమ్మకం కలగడం లేదు. మరో రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోపే.. ఈ కూటమి చీలికలు పీలికలైపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాముల మధ్య కన్పిస్తున్న ఈ లుకలుకలు చూస్తే.. ఇక మోదీ పని నల్లేరు మీద నడకలా ఉండేలా కన్పిస్తోంది. మోదీ మ్యానియాతో మామూలుగానే జోరుమీద ఉన్న బీజేపీకి.. కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన అయోధ్య ఆలయం మరింత ఊపుతేగా… ఇండియా కూటమి భాగస్వాముల విచ్ఛిన్న వైఖరి… ఇక బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది.

ఎవరో చెప్పినట్లు.. రాజకీయాల్లో ఆత్మహత్యలేకాని, హత్యలు ఉండవనేది పాతనానుడి. ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు అనుసరిస్తున్న ఆత్మహత్యా సదృశ వైఖరి చూస్తే.. ఈ నానుడి నిజమేనని మరోసారి రుజువవుతోంది. ఇదంతా చూస్తే.. పాపం కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయస్థాయిలో మరోసారి తీవ్ర నిరాశే ఎదురయ్యేలా ఉంది.

Also Read: తగ్గేదేలే అంటున్న అన్నాచెల్లెలు.. సీఎం జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల, ఏపీలో ఏం జరగనుంది?