ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పక్షాలతో బీజేపీ ‘సేఫ్‌ గేమ్‌’.. అంతుచిక్కని కమలనాథుల వ్యూహం

సొంతంగానే కనీసం 271 కంటే ఎక్కువ సీట్లు సాధించి, స్వతంత్రంగా మళ్లీ అధికారం చేపట్టనుందా? లేదా గత ఎన్నికల్లో లాగా, మళ్లీ 300కి పైగా స్థానాలను గెల్చుకోగలుగుతుందా ?

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పక్షాలతో బీజేపీ ‘సేఫ్‌ గేమ్‌’.. అంతుచిక్కని కమలనాథుల వ్యూహం

Updated On : January 25, 2024 / 9:55 PM IST

BJP Safe Game : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారం! జాతీయ రాజకీయాలను గమనించే ఏ పది మందిని అడిగినా కనీసం 7-8 మంది వ్యక్తం చేసే అభిప్రాయం ఇది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 303 లోక్‌సభ స్థానాలను గెలిచింది.

మరి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో.. బీజేపీ బలం ఇంతకంటే పెరుగుతుందా ? లేదా తగ్గుతుందా ? బీజేపీదే అధికారం అయినా.. ఆ పార్టీ సొంతంగానే కనీసం 271 కంటే ఎక్కువ సీట్లు సాధించి, స్వతంత్రంగా మళ్లీ అధికారం చేపట్టనుందా? లేదా గత ఎన్నికల్లో లాగా, మళ్లీ 300కి పైగా స్థానాలను గెల్చుకోగలుగుతుందా ? అంతకంటే ఎక్కువ స్థానాలను గెల్చుకోవాలనే ఆ పార్టీ లక్ష్యం నెరవేరుతుందా?

తమకు ఇంత బలం ఉందని భావిస్తున్న బీజేపీ.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక శాతం లోక్‌సభ సభ్యులు తమకు మద్దతుగా ఉండే అవకాశాలపై ఎందుకు దృష్టి పెట్టింది? తెలంగాణలో సొంతంగా 6 నుంచి 10 స్థానాలను గెలుచుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాల్లో అత్యధికంగా తమకు మద్దతు పలికేవారికే సీట్లు రావాలని బీజేపీ ఎందుకు వ్యూహ రచన చేస్తోంది ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న 42 స్థానాల్లో, అత్యధిక స్థానాలు తమకు మద్దతు ఉండేలా చూసుకోవాలన్న బీజేపీ వ్యూహం వెనుక ఉన్నది కేవలం నంబర్‌ గేమ్‌లో భాగమా ? లేక ఇక్కడ కూడా బలంగా వేళ్లూనుకోవాలన్న లక్ష్యమా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటో చాలా మందికి అంతుపట్టడం లేదు. ఏపీ నుంచి మెజారిటీ లోక్‌సభ సభ్యులు తమకు మద్దతు ఉండేలా బీజేపీ ఎందుకు కోరుకుంటోందన్నది ఆసక్తికరంగా ఉంది.

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

మరో రకంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల లోక్‌సభ సభ్యుల అవసరం బీజేపీకి ఎంతవరకు ఉందనేది పరిశీలించాల్సిన అంశంగా ఉంది. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో లోక్‌సభ సీట్లను కట్టబెట్టిన కీలక రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులను, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఏ స్థాయిలో గెలుచుకోగలదో పరిశీలించాల్సి ఉంటుంది.

దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 133 ఎంపీ స్థానాలున్నాయి. 2019లో దేశవ్యాప్తంగా మోదీ హవా కొనసాగినా.. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ కలిపి బీజేపీకి వచ్చింది కేవలం 30 సీట్లే. ఒక్క కర్ణాటకలోనే బీజేపీ 25 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగా.. ఒక స్వతంత్ర అభ్యర్థికి కమలం పార్టీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత తెలంగాణలో మాత్రమే 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఏపీ, తమిళనాడు, కేరళలోని 84 స్థానాల్లో ఒక్క చోట కూడా బీజేపీ విజయం సాధించలేదు.

కర్ణాటక మినహా తమిళనాడు, కేరళలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోని 59 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. ఒక్క చోట కూడా గెలవలేదు. బీజేపీ ధోరణి కారణంగా తమిళనాట మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే సైతం దూరమవుతూ వస్తోంది. దీనికితోడు కేరళ, తమిళనాడు ప్రభుత్వాలతో గవర్నర్లకు వచ్చిన వివాదాలకు అధికార బీజేపీయే కారణమన్న అపవాదు మూటగట్టుకుంది. ఇవన్నీ బీజేపీకి మైనస్‌ అయ్యే అంశాలుగా మారాయి.

ఇక కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికల్లో 25 సీట్లు గెలిచినా.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో అక్కడ బీజేపీ ప్రభావం తగ్గుతూ వస్తోంది. దీనికితోడు బీజేపీలోని గ్రూపు రాజకీయాలు ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలోనే పలువురు సిట్టింగ్‌ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అధిష్టానానికి తేల్చిచెప్పేశారు. బలంగా ఉన్నామనుకున్న రాష్ట్రంలో బీజేపీకి ఇది ఇబ్బందిగా మారింది. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమయిందన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, మెజారిటీ స్థానాలను గెలవాలన్నది ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ వ్యూహం. ఇటీవలే తమవైపు వచ్చిన జేడీఎస్‌ నేత కుమారస్వామి వల్ల తమ ఓటు బ్యాంకు పెరుతుందన్నది కూడా బీజేపీ ఆశల్లో ఒకటి.

నార్త్‌ ఇండియాలో బీజేపీ ఆధిపత్యం ఎక్కువగానే ఉన్నా.. పలు రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి సవాళ్లే ఎదురవుతున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి స్థానిక పార్టీలు ఇబ్బందికరంగా మారాయి. పంజాబ్‌లో అకాలీదళ్, బీహార్‌లో జేడీయూ, రాజస్థాన్‌లో ఆర్‌ఎల్‌పీతో బీజేపీకి తెగదెంపులు కావడం ఇబ్బందిగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఆ పీక్‌ నంబర్‌ను కాపాడుకోవటం అంత ఈజీ కాదు.

2019లో మహారాష్ట్ర, గోవాలో 48 స్థానాలకు గాను మిత్రపక్షమైన శివసేనతో కలిసి 44 చోట్ల విజయం సాధించింది బీజేపీ. అయితే.. మహారాష్ట్రలో చిరకాల మిత్ర పార్టీగా ఉన్న శివవసేన ఉద్దవ్‌ ఠాక్రే వర్గంతో బీజేపీకి వైరం మొదలైంది. దీనికితోడు కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఉద్దవ్‌ వర్గం కలిసి మహాఘట్‌ బంధన్‌గా ఏర్పడి రోజురోజుకు బలపడుతున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీపై ప్రభావం చూపే అవకాశముంది.

అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. గత ఎన్నికల్లో యూపీలో 80 చోట్ల పోటీ చేసిన బీజేపీ.. 16 చోట్ల ఓటమిపాలైంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లలో గెలిచినా.. మిగతా 14 చోట్ల మాత్రం కమలం పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ చాలా సెగ్మెంట్లలో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ బలంగా ఉండటం బీజేపీకి ఇబ్బందిగా మారింది. అయితే అయోధ్యలో రాముడి ఆలయం ప్రారంభం కావడం తమకు ఎంతో ఉపయోగపడుతుందని, జనం సెంటిమెంట్‌తో అక్కడ మళ్లీ విజయ దుందుభి మోగిస్తామని బీజేపీ నేతలు పూర్తి నమ్మకంతో ఉన్నారు.

40 స్థానాలున్న బీహార్‌లో కూడా క్షేత్రస్థాయిలో బీజేపీ అంత బలంగా లేదు. గత ఎన్నికల్లో బీజేపీ 17 చోట్ల గెలిస్తే.. జేడీయూ, ఎల్‌జేపీ, కాంగ్రెస్‌ పార్టీ మిగతా స్థానాల్లో విజయం సాధించాయి. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న నితీశ్‌కుమార్ నేతృత్వంలో అన్ని పార్టీ కలిసికట్టుగా బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారు. బీహార్‌లో లాలూప్రసాద్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ కూడా నితీశ్‌కుమార్‌ పార్టీతో కలిసి ఉండటం బీజేపీకి ఇబ్బంది కలిగించే అంశమే. దీనికితోడు కమ్యూనిస్టు పార్టీలన్నీ జేడీయూతో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయి.

ఇక పశ్చిమబెంగాల్‌లో బలంగా ఉన్న తృణముల్‌ కాంగ్రెస్‌.. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఇక్కడ వామపక్షాలు కూడా అలయెన్స్‌లో కలవనుండటంతో వీరి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ 18 స్థానాలు దక్కించుకుంటే.. తృణముల్‌ కాంగ్రెస్‌ 22 చోట్ల గెలుపొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. బీజేపీ ఇక్కడ ఏ మేరకు నెగ్గుకు రాగలదో చూడాలి.

మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, అసోం వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలంగానే ఉన్నా.. అవన్నీ సిట్టింగ్‌ స్థానాలే. ఇక మిగతా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలన్నీ సింగిల్‌ డిజిట్‌లో ఉన్నవే. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి, బీజేపీ ఇప్పుడు బాగా ఆశలు పెట్టుకున్నది రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముడి ఆలయం ప్రారంభం కావడం మీదే. హిందూ సెంటిమెంట్‌ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉందని, ఇది ఖచ్చితంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల పంట పండిస్తుందని బీజేపీ నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఇటీవల అధికారంలోకి రావడం కూడా తమకు అనుకూల అంశమని, ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో ఇది బాగా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మెజార్టీ లోక్‌సభ సభ్యులు తమవైపు ఉండటం ఎందుకైనా ‘సేఫ్‌’ అని బీజేపీ భావిస్తోంది. అందుకనే.. తెలంగాణలో 6 నుంచి 10 స్థానాల్లో గెలవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ఇక.. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే, తమంతట తాము ఒక్క సీటు కూడా గెలుచుకోలేమని బీజేపీకి తెలుసు. ఇది ఇప్పట్లో మారదని కూడా బీజేపీకి పూర్తి క్లారిటీ ఉంది. అయితే.. అక్కడ ఉన్న రెండు ప్రధాన పక్షాలైన వైసీపీ, తెలుగుదేశం-జనసేన కూటమిల మద్దతు తమకు ఉంటుందని బీజేపీకి నమ్మకం ఉంది.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

వైసీపీ, టీడీపీ..ఈ రెండు పార్టీల బలహీనతలే… కేంద్రంలో వారు తమకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు కల్పిస్తాయని బీజేపీకి ఎనలేని నమ్మకం. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఉంది. రానున్న ఎన్నికల్లో ఇటు వైసీపీ, అటు తెలుగుదేశం-జనసేన కూటముల్లో ఏపక్షం వైపు ఉండాలో బీజేపీ ఇప్పటి వరకు గుంభనంగా ఉంది. దీనిపై ఎవరి ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓ సందర్భంలో చెప్పినట్లు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా.. మొత్తం 25 మంది లోక్‌సభ సభ్యులు బీజేపీకే గంపగుత్తగా మద్దతు పలుకుతారని, అక్కడ విలక్షణ రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణం అని, చాలా మంది నమ్ముతున్నారు.

ఈ రకంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒకరకంగా బీజేపీకి పరోక్షంగా సేఫ్‌ నంబర్‌ ఇస్తుందని చెప్పాలి. ఓవరాల్‌ నంబర్‌ గేమ్‌లో, రానున్న లోక్‌సభలో ఈ సేఫ్‌ నంబర్‌ తమవైపు ఉండాలని కూడా బీజేపీ ఇప్పటివరకైతే కోరుకుంటోంది. మొత్తం మీద చూస్తే.. బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ మంది లోక్‌సభ సభ్యుల మద్దతు.. ఆ పార్టీని ‘సేఫ్‌ జోన్‌’లో ఉంచుతుందనే చెప్పాలి.

 

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలాన్ని ఇచ్చిన కీలక రాష్ట్రాలు

రాష్ట్రం                   మొత్తం సీట్లు                                 బీజేపీ బలం

ఉత్తరప్రదేశ్                 80                                           64

మహారాష్ట్ర                  48                                           23

పశ్చిమ బెంగాల్‌          42                                           18

బీహార్‌                       40                                             17

మధ్యప్రదేశ్‌                 29                                           28

కర్ణాటక                      28                                           25

గుజరాత్‌                    26                                           26

రాజస్థాన్‌                    25                                           24

ఒడిశా                       21                                              8

తెలంగాణ                  17                                              4

అసోం                         14                                             9

ఝార్ఖండ్‌                  14                                              11

ఛత్తీస్‌గఢ్‌                  11                                               9

హర్యానా                   10                                              10

ఢిల్లీ                             7                                              7

జమ్మూకశ్మీర్‌           6                                                3

ఉత్తరాఖండ్‌               5                                                5

హిమాచల్‌ప్రదేశ్‌         4                                               4

త్రిపుర                       2                                               2

అరుణాచల్‌ప్రదేశ్‌       2                                                2