బెజవాడ వెస్ట్‌లో ఫత్వా రగడ: జలీల్ ఖాన్‌ను వెంటాడుతున్న గతం

బెజవాడ పశ్చిమ టీడీపీలో వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య ఫత్వా రగడ చిచ్చురాజేస్తోంది. నన్ను ఫత్వా పేరుతో అడ్డుకున్నప్పుడు.. షబానాను కూడా

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 04:53 PM IST
బెజవాడ వెస్ట్‌లో ఫత్వా రగడ: జలీల్ ఖాన్‌ను వెంటాడుతున్న గతం

Updated On : February 25, 2019 / 4:53 PM IST

బెజవాడ పశ్చిమ టీడీపీలో వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య ఫత్వా రగడ చిచ్చురాజేస్తోంది. నన్ను ఫత్వా పేరుతో అడ్డుకున్నప్పుడు.. షబానాను కూడా

బెజవాడ పశ్చిమ టీడీపీలో వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య ఫత్వా రగడ చిచ్చురాజేస్తోంది. నన్ను ఫత్వా పేరుతో అడ్డుకున్నప్పుడు.. షబానాను కూడా అడ్డుకోవలసిందేనని మల్లికా  బేగం పట్టుబడుతుంటే.. ఇవన్నీ రాజకీయాల్లో భాగమేనని జలీల్‌ ఖాన్‌ కొట్టిపారేస్తున్నారు. అసలు నేతలను రోడ్డుపైకి తీసుకువచ్చిన ఆ ఫత్వా ఏంటీ.. పైకి గంబీరంగా ఉన్నా లోపల జలీల్‌ ఖాన్‌ను  వెంటాడుతున్న ఆ భయం ఏంటి..

జలీల్ ఖాన్ రెండు సార్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్‌ నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందితే .. వైసీపీ ఎమ్మెల్యేగా 2014లో  గెలుపొంది టీడీపీలో చేరారు. బీకాంలో ఫిజిక్స్ అన్న ఒక్క పదంతో మంత్రి పదవి చేజారిపోయింది. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి కాస్త ఊరటనిచ్చినా .. జీవితాశయమైన మంత్రి పదవి కల మాత్రం  తీరలేదు. రాజకీయ వారసురాలిగా జలీల్ ఖాన్ తన కూతురు షబానా ఖాతూన్‌కు ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలని కోరడంతో.. చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు.  అయితే జలీల్ వ్యతిరేకవర్గం మాత్రం షబానా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

మాజీ మేయర్ మల్లికాబేగం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ఓడిపోయింది కూడా జలీల్ ఖాన్ వల్లే. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మల్లికాబేగంను అభ్యర్ధిగా ప్రకటించడంతో .. తీవ్ర మనస్ధాపం చెందిన జలీల్ ఖాన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే జలీల్ ఖాన్‌కు 14వేల ఓట్లు మాత్రమే వచ్చినా .. మల్లికాబేగం ఓటమికి ఆ  14వేల ఓట్లే కీలకంగా మారాయి. ఇదిలా ఉంటే మల్లికాబేగంను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా .. ముస్లిం మహిళలు రాజకీయాల్లోకి రాకూడదంటూ .. మతపెద్దలతో ఆమెపై ఫత్వా  జారీ చేయించి .. ముస్లింలకు కాస్త దూరం చేశారు జలీల్ ఖాన్. దీంతో 2009 ఎన్నికల్లో మల్లికా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జలీల్‌ ఆరోగ్యం సహకరించకపోవడంతో..  ఆయన కుమార్తె షబానా ఖాతూన్ టీడీపీ అభ్యర్ధిగా ప్రచారంలోకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఫత్వా వ్యవహారం జలీల్ వర్గియుల్లో ఆందోళన కలిగిస్తోంది.  

గతంలో ముస్లిం మహిళలు రాజకీయాల్లోకి రాకూడదన్న కారణంతో ఫత్వా జారీ చేసిన ముస్లిం పెద్దలు .. ప్రస్తుతం జలీల్ కూతురుకు ఎలా అనుమతి ఇస్తారు అని మాజీ మేయర్ మల్లికా ప్రశ్నిస్తున్నారు. నాకో న్యాయం షబానా ఖాతూన్‌కు ఒక న్యాయమా అంటూ నిరసన గళం విప్పుతున్నారు. షబానాపైనా ఫత్వా జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ముస్లిం మత పెద్దలు సమాధానం చెప్పకుంటే తన కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని మల్లికా బేగం హెచ్చరిస్తున్నారు.  

ఇదిలా ఉంటే జలీల్ ఖాన్ మాత్రం రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఫత్వా వ్యవహారం మాత్రం మరింత ముదిరితే .. జలీల్ ఖాన్‌కు తలనొప్పి ఖాయమంటూ  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నాగుల్ మీరాకు పదవిచ్చి సైలెంట్ చేసిన టీడీపీ అధిష్టానం.. మల్లికాబేగంకు ఎటువంటి హామీలిస్తుందో చూడాలి.