Kishan Reddy: మీడియాతో చిట్ చాట్ లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల రాజేందర్ ఏం చెప్పారో బయట కూడా అదే చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఈటల రాజేందర్ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, మేము వద్దు అంటున్నామా..? అని అన్నారాయన. మేము తప్పు చేయలేదు కాబట్టే అందరికన్నా ముందుగా కమిషన్ విచారణకు వెళ్ళామన్నారు.
”విచారణకు హాజరయ్యేందుకు మేము డేట్ మార్చుకోలేదు. బీజేపీ అందరికీ అలుసుగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాపై విమర్శలు చేస్తారు. కేటీఆర్ కు ఏమీ తెలియదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ తప్పు ఎలా అవుతుంది? మేడిగడ్డ కూలిపోలేదా? డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ మీద. కాళేశ్వరం పైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఆర్థికశాఖ మంత్రిగా తనకు తెలిసిన విషయాలను ఈటల చెప్పారు. ఈటల మాట్లాడిన మాటలను నేతలు సమర్థించడం, విబేధించడం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆయన వాస్తవాలు చెప్పారు. ఈటల వ్యాఖ్యలతో మా నేతలు ఇబ్బందిపడుతున్నారన్న అంశం నా దృష్టికి రాలేదు. మా పార్టీ స్టాండ్ ఒకటే. సీబీఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి.
బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ ని కోరుతున్నా. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరగకూడదు. అప్పుడే కుమ్మక్కయ్యారని విమర్శలు చేస్తే ఎలా..? చంద్రబాబు డీపీఆర్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పేది నేను చెబుతాను. పోలీసులను పెట్టి కృష్ణ నీళ్లను తీసుకెళ్తుంటే బీఆర్ఎస్ ఏం చేసింది? అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దానిపై కేంద్రం మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం నిష్పక్షపాతంగా వ్యహరిస్తుంది.
Also Read: కాళేశ్వరం సబ్ కమిటీలో తుమ్మల కూడా ఉన్నా.. ఆయన్నెందుకు పిలవలేదు?: హరీశ్ రావు సంచలనం..
రాజాసింగ్ ది మా ఇంటి విషయం. మా ఇంట్లో మాట్లాడుకుంటాము. రాజాసింగ్ మా గౌరవ ఎమ్మెల్యే. తెలంగాణలో బీజేపీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందని అనుకోవడం లేదు. పబ్లిసిటీ కోసం ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా. మెట్రోకు డీపీఆర్ మొన్న క్యాబినెట్ లో అప్రూవ్ అయ్యింది. కానీ కిషన్ రెడ్డి అడ్డుకున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం అవసరం లేదు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కాంగ్రెస్ కి నాయకుడిగా ఉండటం బీజేపీకి మంచిది. ఆయన అసమర్థతను ఆయన ఒప్పుకోవడం లేదు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది నా టార్గెట్. రామప్ప టెంపుల్, ఆలంపూర్, భద్రాచలం, వికారాబాద్, భువనగిరి టూరిజం డెవలప్ మెంట్ కింద నిధులిచ్చాము. వాటిని ఇంకా పూర్తి చేయలేదు.
తుమ్మల నాగేశ్వరరావు ఆల్ పార్టీ మంత్రి. తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో మంత్రి. కాళేశ్వరం కట్టినప్పుడు తుమ్మల, ఈటల మంత్రులు. ఎవరు నిజం చెప్పారనేది వాళ్ళు తేల్చుకోవాలి. సింగరేణికి రూ.42 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. మా ప్రభుత్వం ఒడిశాలో వచ్చాక గని ఇప్పించాము. నేను సింగరేణిపై రివ్యూ చేసి ఖర్చులు తగ్గించాలని సూచించాను. CSR ఫండ్స్ దారి మళ్లించ్చారు. సిరిసిల్ల, సిద్దిపేటకు వాడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రూ.1200 కోట్లు ఇవ్వాలి” అని కిషన్ రెడ్డి అన్నారు.