తెలంగాణ బడ్జెట్..రైతులకు గుడ్ న్యూస్ : రూ. 25 వేలలోపు ఉన్న రుణాలు మాఫీ

  • Publish Date - March 8, 2020 / 06:38 AM IST

తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు…5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2020-21 సంవత్సరానికి బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు శాసనసభలో 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ప్రవేశపెట్టారు.

ఈ నెలనే 25 వేల రూపాయలలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి రూ. 1, 198 కోట్లను విడుదల చేస్తుందన్నారు. ఈ రుణమాఫీ మొత్తాన్ని చెక్కుల రూపంలో శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రభుత్వం అందచేయడం జరుగుతుందన్నారు.

రూ. 25 వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలు మొత్తం రూ. 24 వేల 738 కోట్లు ఉన్నాయన్నారు. నాలుగు విడతలుగా శాసనసభ్యులు చెక్కుల రూపంలో రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లను ప్రతిపాదించామన్నారు. 

2014లో ఎన్నికల్లో లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ఆనాడు చెప్పామని గుర్తు చేశారు. అందుకనుగుణంగా..రూ. 16 వేల 121 కోట్లను పూర్తిగా మాఫీ చేశామన్నారు. గత ఎన్నికల్లో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పామని తెలిపారు.

ఆర్థిక మాంద్యం ఉన్నా..వారి శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆకర్షించాయని గుర్తు చేశారు. మొదట్లో ఎకరానికి రూ. 4 వేలు చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ. 8 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు.

గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం…రైతు బంధు సాయాన్ని పెంచినట్లు చెప్పారు. ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు చొప్పున సాయం అందించడం జరుగుతోందన్నారు. రైతు బంధు ద్వారా 2018 – 19 సంవత్సరానికి వానాకాలంలో రూ. 5 వేల 235 కోట్ల రూపాయలను, యాసంగి లో రూ. 5 వేల 244 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు.

2019-20లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 12 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించి…రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా పాస్ బుక్‌లు రావడం వల్ల…రైతు బంధు లబ్దిదారుల సంఖ్య పెరుగుతుందన్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లను అదనంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తుందన్నారు.

రైతు బంధు కోసం రూ. 14 వేల కోట్లను ప్రతిపాదించినట్లు చెప్పారు. రైతులు మరణిస్తే..ఆ కుటుంబానికి రూ. 5 లక్షలను బీమా మొత్తాన్ని అందించే విధంగా రైతు బీమాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు పేరిట…రూ. 2 వేల 271.50 పైసల ప్రీమియాన్ని LICకి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామన్నారు. 
 

Read More : తెలంగాణ బడ్జెట్ : కేంద్ర నిధులు తగ్గుతున్నాయి – హరీష్