Former Minister passed away : కరోనాతో మాజీ మంత్రి మృతి

TRS Leader, Former Minister Chandulal passed away, due to corona :  టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, గిరిజన నాయకుడు అజ్మీరా చందూలాల్‌ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కరోనా పాజిటివ్ రావటంతో చికిత్స కోసం మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందూతూ పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.

చందూలాల్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గిరిజన ప్రజల సమస్యలకోసం ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. చందూలాల్‌ మృతిపట్ల రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం తెలిపారు. చందూలాల్‌ పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు మండలం జగ్గన్నపేటలో 1954 ఆగస్టు 17న జన్మించిన ఆయన సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  గిరిజన విద్యార్థి నాయకుడిగా, స్పెషల్‌ టీచర్‌గా ఉద్యోగం పొంది గిరిజనుల్లో విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. రాజకీయాల పట్ల ఆకర్షితుడై టీడీపీలో చేరారు.

తన సొంత ఊరుకు సర్పంచ్‌గా పనిచేసి అనతి కాలంలోనే జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గిరిజనుల ప్రతినిధిగా చందూలాల్‌ని గుర్తించారు. మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటింపచేయటంలో ఆయన కీలక భూమిక పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్‌ హయాంలో, తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో ఆయన 2005లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుల్లో ఆయనొకరుగా ఎదిగారు. 1996, 1998లలో లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. 2005లో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు