త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో అధికార పార్టీ నేతలకు పరీక్షగా మారుతున్నాయా? రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ, పార్టీ పదవులు నేతలకు దక్కలేదు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా ఖాళీగానే ఉన్నాయి.
ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా నేతలకు పదవులే కట్టబెట్టే సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు పదవుల పంపిణీ అధికార పార్టీలో లేనట్లే అని అంటున్నారు. దీనికితోడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీలో చురుగ్గా వ్యవహరించే నేతలకే భవిష్యత్తులో గుర్తింపు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లోనూ పనిచేస్తేనే :
వచ్చే నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో నేతల పని తీరుపై పార్టీ పూర్తి స్థాయిలో ఆరా తీయాలని నిర్ణయం తీలుకుందంట. రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఎన్నికలను టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఫలితాలు ఏకపక్షంగా సాధించి ప్రజల మద్దతు తమకే ఉందని మరోసారి నిరూపించుకోవాలని గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. నేతలు కూడా సాధారణ ఎన్నికలకు ముందు పని చేసినట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పని చేయాలన్న సూచనలను పార్టీ కీలక నేతలు ఇస్తున్నారట.
నేతల పనితీరుపై నివేదికలు :
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గతంలోనే పార్టీ ఇన్‌చార్జిలను నియమించింది. తమ పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితితో పాటు నేతల పనితీరుపై పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలని సూచనలు ఇచ్చిందట. పార్టీపరంగా చేపడుతున్న సర్వే ద్వారా నేతల పనితీరును పార్టీ అంచనా వేయనుంది.
ఆశించిన ఫలితాలు సాధించిన నేతలకు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని అంటున్నారు. పదవుల్లో ఉన్న నేతలకు కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలే భవిష్యత్తుకు ప్రామాణికంగా నిలుస్తాయని చెబుతున్నారు.