కర్నూలు: 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర మాజీమంత్రి సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిధ్దం అయ్యింది. కోట్ల టీడీపీలో చేరుతూ చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వాటిలో కర్నూల్ ఎంపీ స్దానాన్ని తనకే ఇవ్వాలని ఆయన కోరారు. కాగా వైసీపీ నుంచి గెలిచి ఇప్పటికే టీడీపీలో చేరి తనకే పార్లమెంట్ సీటు వస్తందనే నమ్మకంతో ఉన్న కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక ఇప్పటికే నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
14 అసెంబ్లీ స్దానాలున్న కర్నూలు జిల్లాలో టీడీపీకి గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 5గురు వైసీపీ ఎమ్మేల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ,ఎస్వీ మోహన్ రెడ్డి,బుట్టా రాజశేఖర్ రెడ్డి, మణిగాందీలు టీడీపీలో చేరటంతో ఆసంఖ్య 8కి చేరింది, ఆతర్వాత కర్నూలు ఎంపీ బుట్టా రేణుకా, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరిపోయారు. కోట్ల టీడీపీలో చేరుతుండటంతో, ఇప్పటికే ఉన్న నాయకులకు సీట్లు సర్దుబాటు ఎలా ఉంటుందనేది ఉత్కంఠంగా మారింది. కాగా…… కోట్ల చేరిక పై బుట్టా స్పందిస్తూ…. టీడీపీలోకి ఎవరొచ్చినా.. పార్టీ బలోపేతం అవుతుందని, టికెట్ల విషయం అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కి ఇచ్చి, బుట్టాకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యత్వం ఏదో ఒకటి ఇవ్వవచ్చని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే బుట్టా రేణుక కర్నూలు లోక్‌సభ కాకపోతే ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డితో మాట్లాడి రావాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితమే బుట్టారేణుక కు చెప్పి పంపించారు. జిల్లాలో తాజాగా మారుతున్నరాజకీయ సమీకరణాల నేపధ్యంలో బుట్టాకు ఎమ్మిగనూరు సీటు ఇస్తారా, రాజ్యసభ సీటు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.