Telangana Congress Record
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియాలోనే అతి చిన్న వయస్కులైన ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ.. ఈ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందిన మైనంపల్లి రోహిత్.. దేశంలోనే అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టి రికార్డు సృష్టించారు. తాజాగా.. NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ సైతం చిన్న వయసులోనే శాసనమండలిలో అడుగుపెడుతూ మరో రికార్డు నమోదు చేయబోతున్నారు.
కొడుకు కోసం పెద్ద యద్ధమే చేసిన తండ్రి..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హస్తం పార్టీ నుంచి గెలుపొందిన 64 మందిలో మైనంపల్లి రోహిత్.. అతిచిన్న వయసున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కేవలం 26 ఏళ్లకే మెదక్ స్థానం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారాయన. పొలిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఉన్న రోహిత్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆయన తండ్రి మైనంపల్లి హన్మంతరావు.. పొలిటికల్ కెరీర్‌ని పణంగా పెట్టి మరీ కొడుకు కోసం కష్టపడ్డారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను కాదనుకొని.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
Also Read : బీఆర్ఎస్‌లో హాట్ సీట్‌గా ఆ పార్లమెంటు నియోజకవర్గం.. సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక, కేసీఆరే పోటీ చేస్తారా?
అనుకున్న సాధించిన రోహిత్ రావు..
కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి రోహిత్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రోహిత్ గెలుపొందినా.. హన్మంతరావు మాత్రం ఓటమి పాలయ్యారు. మొత్తానికి రోహిత్ మాత్రం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రస్తుతం దేశంలోనే అతి చిన్న వయసు గల ఎమ్మెల్యేగా రోహిత్‌రావు రికార్డు నమోదు చేశారు. ఆయన తర్వాత తెలంగాణలో అతి చిన్న వయసులో అసెంబ్లీలో ఉన్నది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. ఆమె వయసు 27 ఏళ్లు.
సీనియర్లను పక్కన పెట్టి మరీ..
ఇక పెద్దల సభగా పేరొందిన శాసనమండలిలో కూడా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ సరికొత్త రికార్డు నమోదు చేయనున్నారు. ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతోంది. అసెంబ్లీలో తగిన బలం ఉండటంతో బల్మూర్ వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే. కేవలం 30 ఏళ్ల వయసులోనే శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు బల్మూర్ వెంకట్. NSUI అధ్యక్షుడిగా కాంగ్రెస్ తరఫున అనేక ఉద్యమాలు చేసిన వెంకట్ సేవలను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఈ క్రమంలోనే పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా.. వారందరినీ పక్కన పెట్టి బల్మూరిని పెద్దల సభకు పంపుతోంది హస్తం పార్టీ.
Also Read : ఆ 3 ఎంపీ సీట్లపైనే 3 ప్రధాన పార్టీల గురి.. ఆ మూడు ఏవి అంటే..
మొత్తం మీద.. 26 ఏళ్ల వయసులోనే దేశంలోనే అతి తక్కువ వయసున్న ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ ఇప్పటికే రికార్డు సృష్టిస్తే.. 30 ఏళ్ల వయసులోనే పెద్దల సభకు వెళ్లనున్న బల్మూర్ వెంకట్ మరో రికార్డు నమోదు చేయనున్నారు.