జగన్ తీరుని జీర్ణించుకోలేకపోతున్న పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు, అసలేం జరిగింది

  • Publish Date - July 30, 2020 / 02:37 PM IST

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందరు పెద్దలకు కూడా తమ బాధ తెలియజేయాలని ఆ వర్గం నేతలు భావించారట. కాకపోతే జగన్‌ మాత్రం రాజ్యాధికారం అంటే అధికార సామాజికవర్గం ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలా అని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అధికారం చేపట్టిన నాటి నుంచి పదవుల విషయంలో మొదటి నుంచి జగన్‌.. బీసీలకే పదవులు కట్టబెడుతున్నారు. పార్టీలో రెడ్డి సామాజికవర్గం, కాపు సామాజిక వర్గాలకు చెందిన సీనియర్లు ఉన్నా బీసీ నేతలను తెరపైకి తెస్తున్నారు. అది కూడా రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న వారికి ఊహించని పదవులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

జీర్ణించుకోలేకపోతున్న రెడ్డి సామాజికవర్గం నేతలు:
వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులు అన్నింటి విషయంలో సీఎం జగన్ ఓ క్లారిటీతో ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా బీసీ నేతలను ముందుంచి ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా బీసీ నేతలు ముందుండి పార్టీకి అండగా ఉంటున్నారు. ఈ విషయం రెడ్డి సామాజికవర్గ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హవా కొనసాగుతుందనుకుంటే పూర్తి విరుద్ధగా జరగడంతో ఆ సామాజిక వర్గ నేతల్లో అసహనం పెరుగుతోందని అంటున్నారు. కనీసం ప్రభుత్వంలో కాకపోయినా పార్టీలో అన్నా కొంచెం మంచి పదవులు వస్తాయనుకుంటే అవి కూడా బీసీ నేతలకే కట్టబెడుతుండడటం నచ్చడం లేదంటున్నారు.

హోంమంత్రి పదవి ఆశించిన రోజా:
ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ పోరాటంలో కీలకంగా వ్యవహరించింది ఆ సామాజిక వర్గం నేతలే. ఎమ్మెల్యేలు రోజా, ఆర్కే, శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి, పీఆర్కే, భూమన కరుణాకర్ రెడ్డి, కాటంరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కొంత మంది సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు అధికారంలోకి వస్తే తమకి అంతా మంచే జరుగుతుందని ఆశించారు. ఇప్పుడు భిన్నంగా జరుగుతుండడంతో కంగుతింటున్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌కు తోడుగా ఉంటూ కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే తనను కేబినెట్లోకి తీసుకొని, హోం మంత్రి పదవి కూడా ఇస్తారని ఆశించారు. కానీ, ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చి సరిపుచ్చారు.

ఆర్కే, పీఆర్కే ఆశలపై నీళ్లు:
నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముప్పుతిప్పలు పెట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఓటుకు నోటు కేసు పాటు చంద్రబాబు వైఫల్యాలు ఎత్తి చూపి సక్సెస్‌ అయ్యారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి చంద్రబాబు తనయుడు లోకేశ్‌పై విజయం సాధించడంతో మంత్రి పదవి ఖాయమని భావించారు. తీరా చూస్తే ఆర్కే అన్న అయ్యోధ్యరామిరెడ్డిని రాజ్యసభకి పంపి ఆ కుటుంబ లెక్కలు సరిచేశారు సీఎం జగన్. ఇంకో వైపు గుంటూరు జిల్లాలో పార్టీకి ఆయువు పట్టులా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే కూడా మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ మొదటి దఫా అవకాశం రాలేదు. మొన్న ఖాళీ అయిన రెండింటిలో ఒకటి గ్యారెంటీ అనుకున్నారు. జగన్ మాత్రం ఆయనకు అవకాశం కల్పించలేదు.

ఒక నవ్వు నవ్వి చెవిరెడ్డిని చూసుకోండబ్బా అన్న సీఎం జగన్:
ఇక, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అయితే పార్టీ పెద్దలు దగ్గర మొదటి నుంచి మంత్రి పదవి కావాలని పట్టుపడుతున్నారు. అపుడు అవకాశం రాకపోవడంతో మొన్న ఖాళీ అయినప్పుడు తనకు ఇవ్వాలి అని జగన్‌ను కోరారట. కానీ, సీఎం ఒక్క నవ్వు నవ్వి చెవిరెడ్డిని చూసుకోండబ్బా అని పార్టీ పెద్దలకు చెప్పి వెళ్లిపోయారట. నెల్లూరు పెద్ద రెడ్ల పరిస్థితి మరీ ఘోరం. కాకాని, కాటంరెడ్డిలకు ఎలాంటి భరోసా కూడా సీఎం ఇవ్వలేదట. శ్రీకాంత్ రెడ్డికి చీఫ్‌ విప్ పదవిచ్చి సరిపెట్టారు సీఎం జగన్. ఇలా ఆ సామాజికవర్గం నేతలు కలిసినప్పుడు ఈ విషయం మీదే టాపిక్‌ నడుస్తోందని అంటున్నారు.

రెడ్డి నేతలకు కంటి మీద కునుకు లేదు:
పార్టీ కీలక పదవులలో మూడు పదవులు తప్ప మిగిలిన అన్ని పదవులు ఇతర సామాజికవర్గాలకే జగన్‌ కట్టబెట్టారు. అదే విధంగా ఏ చిన్న అవకాశం ఉన్నా వారిని పైకి తీసుకువస్తూ పెద్ద పీట వేస్తుండటం రెడ్డి నేతలకు కంటికి కునుకు లేకుండా చేస్తోందట. సీఎం దృష్టికి విషయం వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు.