Samata
Sri Ramanujacharya’s Statue : ప్రతి హోమగుండంలో ఒక్కో పూటా 4 కిలోల స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతో తయారుచేసిన నెయ్యిని వినియోగిస్తారు. రోజుకు ఒక్కో యాగశాలలో 9 హోమగుండాలకు కలిపి.. 72 కిలోల నెయ్యి అవసరమవుతుంది. ఈ నెయ్యిని.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని.. దేశీయ ఆవు పాల నుంచి సేకరించారు. యాగ మహా క్రతువు కోసం 11 రోజుల పాటు 2 లక్షల కిలోల స్వచ్ఛమైన నెయ్యిని వినియోగించనున్నారు. అలాగే హోమగుండాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలనే ఉపయోగిస్తున్నారు. శ్రేష్ఠమైన రావి, జువ్వి, మేడి, మామిడితో వచ్చే కట్టెలనే.. ఈ సహస్ర కుండాత్మక యాగ క్రతువులో వాడుతున్నారు. హోమగుండం నుంచి వచ్చే పొగ.. బ్యాక్టీరియాలు, వైరస్‌లను నిర్మూలించనుంది.
ప్రతి పనికి ఒక నియమం : –
ప్రతి హోమగుండం దగ్గర ముగ్గురు రుత్విజులు గానీ.. పండితులు గానీ కూర్చుని యాగం నిర్వహిస్తారు. ఒక్కో యాగశాలకు పర్యవేక్షకుడిగా.. ఉపద్రష్ట వ్యవహరిస్తారు. హోమశాల బయట సందర్శకులు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాగం చేసే వారిని మినహా.. మిగిలిన వారిని యాగశాల లోపలికి అనుమతించరు. శ్రీ మహా విష్ణు యాగ క్రతువంటే.. 144 యాగశాలలు, 1035 హోమగుండాలు మాత్రమే కాదు. ఇక్కడ చేసే ప్రతి పనికి ఒక నియమం ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి వైదిక సంప్రదాయం ఉంటుంది. 9 రకాల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన హోమగుండాలకు.. ఒక్కో దానికి ఒక్కో విశిష్టత ఉంది. సహస్ర కుండాత్మక మహా యాగం. ఎంతో విశేషమైనటువంటి క్రతువు. సాధారణంగా.. హోమగుండాలను అగ్గిపెట్టెతోనో.. కర్పూరంతోనే వెలిగిస్తారు. కానీ.. ఇక్కడ అలా కాదు. హోమగుండాలను వెలిగించేందుకు.. అగ్ని మధనం నిర్వహిస్తారు.
9 రకాల అగ్ని కుండాలు : –
రావి చెట్టు, జమ్మి చెట్టు నుంచి.. అగ్నిని పుట్టిస్తారు. జమ్మి చెట్టు చెక్కను కింద ఉంచి.. దాని మీద రావి చెట్టు కర్రను పెట్టి.. అగ్ని మధనం చేస్తారు. ఈ రెండే ఎందుకంటే.. రావి నారాయణుడికి ప్రతీక. జమ్మి లక్ష్మీ దేవికి ప్రతీక. ఈ రెండింటిని కలిపి మథనం చేసి.. వాటి నుంచి పుట్టే అగ్గిని తీసుకుంటారు. ఆ అగ్నిని.. ప్రధాన యాగశాలలోని గుండంలో వేస్తారు. ఆ అగ్నినే.. వివిధ భాగాలు చేసి.. అన్ని యాగశాలలకు.. పంపిస్తారు. 144 యాగశాలల్లో.. ఒక్కో యాగ శాలలో.. 9 రకాల అగ్ని కుండాలను ఏర్పాటు చేశారు. ఇవి.. ఒక్కొక్కటి.. ఒక్కో విధమైన ఆకృతిలో ఉంటాయి. దీని వెనుక.. వైదిక సంప్రదాయం, హోమ నియమాలున్నాయి. ఒక్కో ఆకృతి కుండంలో చేసే యాగానికి.. ఒక్కో విధమైన యాగ ఫలం దక్కుతుందని చెబుతున్నారు. ఒక రకమైన కుండంలో యజ్ఞం చేస్తే జ్ఞానం, మరో రకమైన గుండంలో యాగం చేస్తే సంతానసిద్ధి.. ఇలా రకరకాల యాగ ఫలాల కోసం.. 9 ఆకృతుల్లో.. హోమ గుండాలను ఏర్పాటు చేశారు.