Mahashivaratri 2026: నేడే మహాశివరాత్రి.. ఈ ఒక్క ద్రవ్యంతో శివుడికి అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం పొందుతారు..!
ఉపవాసం రెండు రకాలు. ఆహారం తీసుకోకుండా చేసే ఉపవాసం, శివుడి ఆలోచనలో ఉంటూ చేసే ఉపవాసం. 12ఏళ్లు లోపు వారికి, 65 సంవత్సరాలు దాటిన వారికి ఆహారం స్వీకరించకుండా చేసే ఉపవాసం లేదు.
Mahashivratri 2026 Representative Image (Image Credit To Original Source)
- సంపంగి, మొగలి తప్ప ఏ పుష్పాలతోనైనా శివుడిని పూజించొచ్చు
- జాగరణ పేరుతో సినిమాలకు వెళితే ఎలాంటి ఉపయోగం లేదు
- శివరాత్రి రోజున జాగారం చేసి మరునాడు ఉదయం నిద్రపోవడం కరెక్ట్ కాదు
Mahashivaratri 2026: మహాశివరాత్రి రోజు అన్నింటికంటే ఏ ద్రవ్యంతో అభిషేకంతో శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు? నిజమైన ఉపవాసం, నిజమైన జాగరణ ఏ విధంగా చెయ్యాలి? మహాశివరాత్రి సందర్భంగా ఏ కథను వింటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి శివానుగ్రహం తొందరగా కలుగుతుందో తెలుసుకుందాం.
మహాశివరాత్రి రోజున పంచగవ్య అభిషేకం శివుడికి చేస్తే పరమేశ్వరుడు అమితంగా ఆనందించి వెంటనే అనుగ్రహిస్తాడని శివ పురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు.
పంచ గవ్య అభిషేకం అంటే..
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం (ఆవు పేడ), గోవు పంచకం (గోమూత్రం).. ఈ ఐదింటిని కలిపి కానీ వేర్వేరుగా కానీ ఇంట్లో ఉన్న శివ లింగానికి అభిషేకం చేస్తూ నమ:శివాయ పంచాక్షరి మంత్రం చదువుకోండి. దీన్ని పంచగవ్య అభిషేకం అంటారు. ఇది అన్ని అభిషేకాల కంటే చాలా గొప్పదని శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు.
ఈ పంచగవ్య అభిషేకం చేయటం వీలు కాకపోతే భస్మాభిషేకానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భస్మం నీళ్లలో కలిపి ఆ జలాలతో శివలింగానికి అభిషేకం చేసినా శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు.
వరాత్రి రోజు ఏ పుష్పాలతో శివుడిని పూజించాలి..
సంపంగి, మొగలి తప్ప ఏ పుష్పాలతోనైనా శివుడిని పూజించొచ్చు. గడ్డి పూలతో పూజించినా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు.
దీపారాధన ఎలా చేయాలి..
మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఏ నూనెతో దీపారాధన చేసినా సరే ఒక బొట్టు ఆవు నెయ్యి తప్పకుండా వేయాలి. లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి.
నిజమైన ఉపవాసం, నిజమైన జాగరణ ఎలా చేయాలి..
ఉపవాసం రెండు రకాలు. ఆహారం తీసుకోకుండా చేసే ఉపవాసం, శివుడి ఆలోచనలో ఉంటూ చేసే ఉపవాసం. 12ఏళ్లు లోపు వారికి, 65 సంవత్సరాలు దాటిన వారికి ఆహారం స్వీకరించకుండా చేసే ఉపవాసం లేదు. గర్భిణులు, బాలింతలు, అనారోగ్యవంతులకు ఆహారం తీసుకోకుండా ఉపవాసం లేదు. మిగిలిన వాళ్లు మాత్రమే ఆహారం తీసుకోకుండా రోజంతా పండ్లు, పాలు తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. 12ఏళ్లలోపు పిల్లలు, 65ఏళ్లు పైబడిన వ్యక్తులు, గర్బిణులు, బాలింతలు, అనారోగ్యవంతులు ఏ విధమైన ఉపవాసం ఉండాలంటే.. శివుడికి సమీపంగా ఉండే ఉపవాసం ఉండాలి. అంటే శివుడి గురించి ఆలోచించాలి. శివ నామ స్మరణ చేయాలి.
నిజమైన జాగరణ అంటే..
జాగరణ అంటే మేల్కోవడం. వేటిలో మేలుకోవాలి అంటే.. శివ సంబంధమైన విషయాల్లో మేలుకోవాలి. వేటిలో నిద్రపోవాలి అంటే ఐహిక సుఖాల్లో నిద్రపోవాలి. శివరాత్రి రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళితే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అవి ఐహిక విషయాలు. శివ సంబంధమైన విషయాల్లో మాత్రమే మేలుకోవాలి. శివ నామ స్మరణ చేయడం, శివ స్తోత్రాలు వినడం, శివాలయంలో ఉండటం, ఇంట్లో శివుడికి పూజ చేసుకోవడం.. ఇలా జాగరణ చేస్తే అది నిజమైన జాగరణ. అంతే కానీ వినోదాత్మకమైన కార్యక్రమాలు చూస్తూ జాగరణ చేస్తే అది జాగరణ కాదు.
శివరాత్రి రోజు ఏ పూజలు చేయలేని వాళ్లు ఏం చేయాలి?
మానసిక శివ పూజ చేయాలి. ఈ సమస్త విశ్వాన్ని ఒక శివ లింగంలా భావిస్తూ ఆ శివ లింగంపైన ఒక చంద్రడు ఉన్నాడని భావించుకుంటూ చంద్రుడి నుంచి శివుడికి అమృతధార పడుతూ శివుడికి అభిషేకం జరుగుతున్నట్లుగా మనసులో ధ్యానించుకుంటూ శివుడికి అభిషేకం చేసుకోవాలి. మనసులోనే నమ:శివాయ అని జపించుకోవాలి. దీన్నే మానసిక శివ పూజ అంటారు. ఇది కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
శివరాత్రి రోజున దేవాలయం దర్శనం తప్పకుండా చేయాలి. శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించుకున్నా, ఆలయంలో జాగరణ చేసినా చాలా మంచిది. శివరాత్రి రోజున లింగపురాణంలో ఉన్న వేటగాడి కథ వింటే సర్వ పాపాలు తొలగిపోతాయి, శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.

Mahashivaratri Representative Image (Image Credit To Original Source)
శివరాత్రి జాగారం చేసి మరునాడు ఉదయం నిద్రపోవడం కరెక్ట్ కాదు. మరునాడు ఉదయం కూడా శివపూజ చేసి ఆ తర్వాత వీలైనంత వరకు నిద్రపోకుండా సాయంత్రం చంద్రుడు కనిపించాక ఎవరికైనా అన్నదానం చేసి ఆ తర్వాత ఆహారం తీసుకుని నిద్రకు ఉపక్రమిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివరాత్రి మరునాడు రథోత్సవాలు నిర్వహిస్తారు. ఆ రథోత్సవనం దర్శించుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. చాలా శివాలయాల్లో శివరాత్రి మరునాడు శివపార్వతుల కల్యాణం చేస్తారు. ఆ కల్యాణం దర్శించినా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
శివరాత్రి రోజు అందరూ శివయా గురవే నమ:, ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీం శివాయ నమ:, శ్రీ శివాయ మహాదేవాయ, ఐశ్వర్వేశ్వరాయ నమ: ఈ మంత్రాల్లో ఏది చదివినా శివుడి అనుగ్రహం పొందుతారు. దారిద్ర దహన శివ స్తోత్రాన్ని శివరాత్రి రోజు చదివినా, విన్నా జన్మజన్మల దారిద్రాలన్నీ తొలగిపోయి శివానుగ్రహానికి సులభంగా పాత్రులు అవుతారు. ఇలా శివరాత్రి రోజు, శివరాత్రి మరునాడు నియమాలు పాటించడం ద్వారా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పండితులు తెలిపారు.
Also Read: మహా శివరాత్రి.. ఉపవాసం ఎలా ఉండాలి.. ఏం తినొచ్చు, ఏం తినకూడదు.. శివుడికి ఏమేం సమర్పించొచ్చు..
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
