Annamacharaya
Annamacharya : తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్ధానంలోని అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతితోపాటు వారి జన్మస్థలమైన తాళ్లపాకలో నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అన్నమయ్య 1408వ సంవత్సరంలో జన్మించారు. 1503వ సంవత్సరంలో పరమపదించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ 32 వేల కీర్తనలు రచించారు.
మార్చి 28న అలిపిరిలో మెట్లోత్సవం…
తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 28వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ నడక మార్గంలో తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకుని హారతి ఇస్తారు. టీటీడీ అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అన్నమాచార్య కళామందిరంలో…
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మార్చి 29న ఉదయం 9 గంటల నుండి సప్తగిరి సంకీర్తనల గోష్టి గానం నిర్వహిస్తారు. మార్చి 30, ఏప్రిల్ 1వ తేదీల్లో ఉదయం 10 నుండి గంటల నుండి సాహితీ సదస్సులు, సాయంత్రం గం. 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సంగీత సభలు జరుగనున్నాయి. మార్చి 31వ తేదీన అంజనాద్రి హనుమద్వైభవం పేరిట సాహితీ రూపకం నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న ఉదయం 9 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం, సంగీత సభలు నిర్వహిస్తారు.
తిరుమలలో….
మార్చి 29వ తేదీన సాయంత్రం గం. 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ప్రముఖ కళాకారులతో ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిలమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజి అనుగ్రహ భాషణం చేయనున్నారు.
మహతి ఆడిటోరియంలో…
మహతి ఆడిటోరియంలో మార్చి 29 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు సంగీత సభలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు పాల్గొననున్నారు.
తాళ్లపాకలో …
కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాకలోని అన్నమయ్య ధ్యానమందిరం వద్ద మార్చి 29న ఉదయం 9 గంటలకు దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహిస్తారు. మార్చి 29 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు సంగీతం, హరికథ కార్యక్రమాలు జరుపనున్నట్లు టీటీడీ తెలిపింది.