సంవత్సరంలో కొన్ని మాసాలు మన హృదయాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అటువంటి ప్రత్యేకమైన మాసం శ్రావణమాసం. ప్రకృతి హరివిల్లుగా మారే ఈ కాలంలో పండుగల సందడి, భక్తి భరితమైన వాతావరణం, కుటుంబ సమిష్టి, రుచికరమైన వంటలు ఇవన్నీ కలసి ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. ఈ సంవత్సరం శ్రావణమాసం ఎక్కువ భాగం ఆగస్టు నెలలో పడుతోంది. పిల్లలకు ఇది మరింత ముద్దుగా ఉంటుంది, ఎందుకంటే పండుగల సరదా పాటు స్కూల్ సెలవులు కూడా చాలానే ఉంటాయి.
శ్రావణమాసంలో పండుగల పరంపర:
శ్రావణమాసం అంటే ఆధ్యాత్మికతకు, ఆచారాలకు మేళవింపు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది చాలా పవిత్రమైన నెలగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే కొన్ని ప్రముఖ పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వరలక్ష్మి వ్రతం: మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలకు, సంపద పుష్టి కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. అలంకారాల మధ్య భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటారు.
రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్): అన్నచెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి, ప్రేమకు గుర్తు రాకీ పండుగ. ఈ పండుగ సందర్బంగా చెల్లెళ్ళు అన్నలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీ కట్టి రక్షణ ఆశీస్సులు కోరే ఈ పండుగ పిల్లలకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. వసుదైక కుటుంబంలోని ప్రేమకు ఆదర్శంగా నిలిచే ఆ పండుగా హిందూ సంప్రదాయాల్లో ఎంతో ప్రధానమైనది.
శ్రావణ శుక్రవారాలు: లక్ష్మీ దేవి శుక్రవారం అనేది చాలా ప్రీతికరమైనది. అందుకే మహిళలు శ్రావణంలో ప్రతీ శుక్రవారం రోజున లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి ఉపవాస దీక్షలు కూడా చేస్తారు.
వినాయకచవితి: భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. “విఘ్నాలను తొలగించే దేవుడు”గా పిలువబడే గణపతి బప్పాను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించే ఈ పర్వదినం ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారిదాకా అందరినీ ఆకట్టుకునే ఈ పండుగ భక్తి, కళ, సంస్కృతి, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుంది.
అవి మాత్రమే కాకుండా.. నాగుల చవితి, పోలాల అమావాస్య, కృష్ణాష్టమి వంటి ప్రత్యేకమైన పండుగలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. కాబట్టి ఈ మాసం అంతా ప్రతీ ఇల్లు, దేవాలయాలు శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక ఈ పండుగలు వచ్చాయంటే పిల్లల ఆటపాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ శ్రావణంలో మాది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శ్రవణంలో వరుస పండుగలు ఉంటాయి కాబట్టి, పిల్లలకు సెలవులు కూడా ఇస్తారు. ఇలా పండుగ రోజుల్లో పిల్లలకు వరుసగా సెలవులు లభించడం వల్ల పిల్లల హృదయాలలో భక్తి భావనను పెంచడమే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం కూడా ఏర్పడుతుంది.
ఆగస్టు నెల పిల్లల ఆనందానికి కేంద్రబిందువు:
ఈ ఏడాది ఆగస్టు నెలలో పండుగల కారణంగా వారం వారం సెలవులు వస్తున్నాయి. 8వ తేదీన వరలక్ష్మీ వ్రతం. 9వ తేదీన రెండో శనివారం, 10వ తేదీన ఆదివారం ఇలా వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. ఇక ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16వ తేదీన కృష్ణాష్టమి, 17న ఆదివారం ఇలా మరోవారంలో కూడా వరుసగా మూడు రోజుకు సెలవులు వస్తున్నాయి. ఇక 3,24 , 31వ తేదీన ఆదివారాలు, ఇది పిల్లలకు ఆనందాన్ని ఇచ్చే విషయం. పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతూ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. పండుగల రోజుల్లో స్కూల్‌లకు సెలవులు రావడం వల్ల వాళ్లు తాతమామల ఇళ్లకు వెళ్లగలుగుతారు. పల్లెటూర్ల పండుగ సంబరాలు, మేళాలు, బోనాలు, కోలాటాలు పిల్లలకు కొత్త అనుభవాలు, ఆనందానికి దారితీస్తాయి.
పండుగలు పిల్లలకు అనుభవ పాఠశాలలు:
పండుగలు అంటే కేవలం మిఠాయిలు తినడమే కాదు. ఇవి పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తాయి. పెద్దలతో కలసి పూజలు చేయడం ద్వారా భక్తి భావం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ విలువలు, ప్రేమ, గౌరవం వంటి విలువలను నేర్చుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెల పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకే కాదు ఒక వేడుకల శ్రేణి. పిల్లల చిలిపి నవ్వులతో, పండుగల రుచులతో, సంబరాల సందడితో ఈ మాసం మరువలేని జ్ఞాపకాలుగా నిలుస్తుంది. కనుక ఈ శ్రావణ మాసాన్ని కుటుంబ సమేతంగా ఉత్సాహంగా, భక్తిగా, ఆనందంగా గడపాలి.