Maha Kumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం, సనాతన పరిమళాలు వెదజల్లే హిందూ ఉత్సవం. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపం మహా కుంభమేళా. ఆధ్యాత్మిక సంగమానికి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ సిద్ధమైంది. సోమవారం (జనవరి 13) నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహా కుంభ మేళా జరగనుంది.
144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా జన జాతర..
జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు ముగుస్తుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా జన జాతర మహోత్సవానికి యూపీ ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది.
సర్వాం సుందరంగా ముస్తాబైన ప్రయాగ్ రాజ్..
మహా కుంభమేళాకు ప్రయాగ్ రాజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పట్టణంలో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ప్రతి కూడలిలో గజ్జలు, ఢమరుకం చిహ్నాలు కనిపిస్తున్నాయి. గోడలకు పెయింటింగ్ లు ఆకట్టుకుంటున్నాయి. నెలన్నర రోజుల పాటు పుణ్య స్నానాలు ఆచరించేందుకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు, యాత్రికులు వస్తారని అంచనా వేసిన యూపీ సర్కార్ అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసింది.
భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ప్రభుత్వం..
కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 2వేల 750 సీసీ కెమెరాలను అమర్చింది. అత్యంత కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కెమెరాలను బిగించింది. భక్తులకు సమాచారం అందించేందుకు 80 టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
డ్రోన్లు, సీసీ కెమెరాలు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు..
9020 పేరిట హెల్ప్ లైన్ తో పాటు 50 మందితో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వేలాది సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లు, ఏఐ సాయంతో పని చేసే కెమెరాలను వినియోగిస్తోంది. నీటిలో కూడా నిఘా ఉంచే డ్రోన్లు అందుబాటులో ఉంచింది. సైబర్ మోసాలకు తావు లేకుండా 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను రంగంలోకి దించింది.
కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాధవుడిని దర్శించుకుంటారు. మర్రి చెట్టును దర్శించుకోవడాన్ని మహా కుంభమేళాలో భాగంగా భావిస్తారు. ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. దీపంతో పాటు ఇతర దానాలు చేయడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సంకీర్తనలు, భజనలు, యోగా, మెడిటేషన్ కు ప్రాధాన్యం ఇస్తారు.
Also Read : శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనాలపై అధికారుల కీలక నిర్ణయం..