ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ప్రధాన మతాలలో బౌద్ధమతం ఒకటి. ఆ మత వ్యవస్థాపకుడు గౌతమ బుద్ధుడు. బౌద్ధమతం ఆధ్యాత్మిక జ్ఞానంపై, వాస్తవికతపై, మానవతావాదంపై దృష్టి పెడుతుంది. మిగతా మతాలతో పోలిస్తే ఇది అత్యున్నతమైనదని 1956లో బౌద్ధం తీసుకునే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. కాగా, బౌద్ధ మతంలో అనేక పవిత్ర దినోత్సవాలు ఉన్నాయి. అందులో ఒకటి బోధి దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న ఈ దినోత్సవం జరుపుకుంటారు. మరి బౌద్ధమతాన్ని విశ్వసించే వారికి బోధి దినోత్సవం ఎందుకు అంత ప్రత్యేకమైనదో చూద్దాం.
బుద్ధుడి చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతముడు. ఆయన రాజ కుటుంబంలో జన్మించారు. అయితే అన్ని భోగాలను విడిచిపెట్టి తపస్సు, అంకితభావాన్ని స్వీకరించారు. ఒకరోజు సిద్ధార్థ గౌతముడు నిశ్శబ్దంగా రాజభవనాన్ని విడిచిపెట్టి, సత్యం, జ్ఞానం కోసం అడవి వైపు బయలుదేరారు. దీని తరువాత ఆయన కఠోర తపస్సు చేసి పరమ జ్ఞానాన్ని పొందాడాని అంటారు. వాస్తవానికి ఈ ధ్యానం వల్ల ఉపయోగం లేదని సత్యం, జ్ణానంపై శోధన చేశారని మరికొందరు అంటారు. ఇకపోతే, బోధి దినోత్సవం.. గౌతమ బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. బుద్ధుడు అంటే మేల్కొన్న లేదా జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని అర్థం.
బోధి దినోత్సవం చరిత్ర
యువరాజు సిద్ధార్థ గౌతమ్ తరువాత బౌద్ధమత స్థాపకుడు అయ్యారు. ఆయన క్రీస్తుపూర్వం 562లో లుంబిని (ప్రస్తుతం నేపాల్)లో జన్మించారు. ఆయన తండ్రి పేరు శుద్ధోధనడు. ఆయన శాక్య వంశానికి రాజు. సిద్దార్థుడు తన 29 ఏట ఇంటిని వదిలి సత్యం, జ్ణానం కోసం పయనం ప్రారంభించారు. 6 సంవత్సరాలు ఆయన లోతైన ఆత్మపరిశీలన, తపస్సు, ధ్యానం చేసి జీవిత పరమార్థాన్ని కనుగొన్నారు. చివరకు బీహార్‌లోని బుద్ధగయలో బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందారు. సిద్ధార్థ గౌతముడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మేల్కొన్న క్షణాన్ని బోధి దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదంతా దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం జరిగింది.
బోధి దినోత్సవం ఎలా జరుపుకుంటారు?
ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధమత ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. బోధి దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన ఆకర్షణ అందరికీ మంచి చేయడం, జీవితంలోని ముఖ్యమైన పాఠాలను గుర్తుంచుకోవడం, జీవితానికి అర్థాన్ని కనుగొనడం, ఆధ్యాత్మికత పునాదిని బలోపేతం చేయడం. సాధారణంగా ఈ రోజున ప్రజలు అంజూరపు చెట్టును బోధి వృక్షంలా అలంకరిస్తారు. ఎందుకంటే బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేశారు. బౌద్ధ సన్యాసులు కూడా ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.